ఎన్నిక‌ల వేళ ఏందీ గీ లొల్లి..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. అధికారపక్షంలోనే వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. పోటాపోటీ రాజకీయాలతో రక్తికట్టిస్తున్నారు నేతలు! వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం అప్పుడే కోట్లాటలు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్‌పార్టీ పెట్టింది పేరు! ఇప్పుడు ఆ పేరును టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయాలను మరపించే స్థాయిలో టీఆర్‌ఎస్‌ దూసుకెళుతోంది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలలో ఒకటి రెండు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణం అయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అవి ముదిరిపాకానపడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి.. తన ఆధిపత్యం కోసం నేతలు క్యాడర్‌ను గందరగోళపరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ అంటూ ఎవరికివారు చెప్పుకుని తిరుగుతున్నారు. వేరువేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే నల్లగొండ.. నాగార్జునసాగర్‌.. మిర్యాలగూడ.. దేవరకొండ.. మునుగోడు.. కోదాడ.. తుంగతుర్తి.. హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నియోజకవర్గాలలో నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది.. తాజాగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు వీధిపోరాటాల వరకు వెళ్లాయి.. రెండు వర్గాల వారు దాదాపు కొట్టుకునేంత పనిచేశారు. హుజూర్‌నగర్‌… ఇది పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. ఇక్కడ ఉత్తమ్‌కు ఎదురులేదనే చెప్పాలి.. ఈ పరిస్థితులలో ఉత్తమ్‌ను వచ్చే ఎన్నికలలో ఓడించాలంటే అందుకు టీఆర్‌ఎస్‌ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాలి.. ఉత్తమ్‌ను ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలున్న అభ్యర్థిని ఎంచుకోవాలి.. గత ఎన్నికలలో స్థానికేతరులు అయినప్పటికీ తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్‌ ఇచ్చింది టీఆర్‌ఎస్‌.. అయితే ఉత్తమ్‌ చేతిలో ఆమె ఓడిపోయారు. ఓటమి తర్వాత ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకరమ్మనే కొనసాగించారు గులాబీబాస్‌ కేసీఆర్‌.. దీంతో మరోసారి శంకరమ్మకే టికెట్‌ ఇస్తారనుకున్నారు.. అందుకు తగ్గట్టుగా గత ఎన్నికల నాటి నుంచి శంకరమ్మ హుజూర్‌నగర్‌ను అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే కొంతకాలం తర్వాత శంకరమ్మ వ్యవహారశైలిపై  స్థానిక నేతలు గుర్రుమనడం మొదలయ్యింది.. దాంతోపాటే గ్రూపులూ మొదలయ్యాయి. మండలాల వారీగా శంకరమ్మ అనుకూల.. వ్యతిరేక వర్గాలుగా టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ విడిపోయింది.. పలుమార్లు శంకరమ్మకు.. స్థానిక నేతలకు మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పడున్న స్థానిక నేతలలో ఎవరికీ ఎమ్మెల్యేగా పోటీ చేసేంత దమ్ము ధైర్యం లేకపోవడం శంకరమ్మకు కొంత ఊరట కలిగించే అంశమే! అయితే ఇటీవల  వ్యాపారవేత్త  అయిన ఓ ఎన్‌ఆర్‌ఐ రంగంలోకి దిగారు.. అధికారపార్టీ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వివాదం మొదలయ్యింది.. 
శానంపూడి సైదిరెడ్డి… మఠంపల్లికి చెందిన ఈయన టీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో చాపకింద నీరులా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈయనకు మంత్రి జగదీశ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సైదిరెడ్డిని రాజకీయంగా ఎంకరేజ్‌ చేస్తున్నది కూడా జగదీశ్‌రెడ్డేనన్న టాక్‌ కూడా ఉంది.. మంత్రి అండదండలతో శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా తన కార్యచరణను అమలు చేస్తూ వస్తున్నారు. పార్టీతో పాటు ముఖ్య నేతల కార్యక్రమాలలోనూ పాలుపంచుకుంటున్నారు. సై అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదే సమయంలో మండలాలలో ఉండే స్థానిక టీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో సైదిరెడ్డి సాన్నిహిత్యం పెంచుకున్నారు. సాధారణంగానే శంకరమ్మకు వ్యతిరేకంగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలు.. కార్యకర్తలు సైదిరెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో హుజూర్‌నగర్‌ టికెట్‌ తనదేనంటూ సైదిరెడ్డి అక్కడక్కడా చెబుతూవస్తున్నారు. పైగా ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతల భేటీలోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిందట! ఈ పరిణామాలను  శంకరమ్మ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక లాభం లేదనుకున్న శంకరమ్మ తనదైన శైలిలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఈమధ్యనే మఠంపల్లిలో సై కార్యక్రమాన్ని తలపెట్టిన సైదిరెడ్డి తన అనుచరులతో కలిసి హుజూర్‌నగర్‌ నుంచి భారీ బైక్‌ ర్యాలీకి సన్నాహాలు చేశారు. ఇది తెలిసిన శంకరమ్మ తన అనుచరులతో కలిసి హుజూర్‌నగర్‌ చేరుకున్నారు. మఠంపల్లిలో కార్యక్రమం అయితే హుజూర్‌నగర్‌ నుంచి ర్యాలీ ఎందుకు..? అంటూ రోడ్డెక్కారు. సైదిరెడ్డి బైక్‌ర్యాలీకి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ ర్యాలీ తీయడానికి ఎవడువాడంటూ పోలీసులతో వాదనకు దిగారు. నియోజకవర్గంలోనే తిరగడానికి వీలులేదంటూ సుమారు రెండు గంటలపాటు రోడ్డుపైన ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారిపైనా తిరగబడ్డారు. పోలీసులు తన చేయి పట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు. చివరకు పోలీసులు సైదిరెడ్డి బైక్‌ ర్యాలీకి అనుమతి లేదని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఆ సమయంలో శంకరమ్మ చేసిన ఆరోపణలు మాత్రం టీఆర్‌ఎస్‌ ఇంకా కలకలం రేపుతూనే ఉన్నాయి. జగదీశ్‌రెడ్డి స్వయంగా సైదిరెడ్డిని తనకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.. అమరుడి తల్లిని ఇబ్బంది పెట్టడం మంత్రికి తగునా అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో తనకు కాదని రాజకీయం ఎవరు ఎలా చేస్తారో చూస్తానని హెచ్చరించారు. ఇవన్నీ హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ వివాదం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలో పడేసేలా కనిపిస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.