అందరూ తిట్టేవాళ్లే.. ఆయన ఎవరి గ్రూపో మరి!

గవర్నర్ గిరీ అనేది మన దేశంలో రాజ్యాంగ బద్ధమైన తటస్థ వైఖరితో కూడిన ఉన్నత పదవే అయినప్పటికీ.. ఆ స్థానాల్లో ఉండే పెద్దలు రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా మెలగిన సందర్భాలు మనకు తక్కువే. ఎందుకంటే క్రియాశీల రాజకీయాలనుంచే చాలా మంది రాజభవన్ లలోకి అడుగుపెడుతూ ఉంటారు. రాజభవన్ నుంచి మళ్లీ వెనక్కు రాజకీయాల్లోకి వచ్చి.. మళ్లీ ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఉన్నారు. కనుక వారు రాజకీయాల్ని త్యజించి.. పూర్తి తటస్థంగా ఉంటారనుకోవడం భ్రమ. అయితే.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ వ్యవహారం మాత్రం రకరకాలుగా కనిపిస్తోంది. ఆయన అసలు ఏ పార్టీకి చెందిన నాయకుడో.. ఏ పార్టీ వారికి అనుకూలుడో.. ఏ పార్టీ వారు ఆయనను తమ శత్రువుగా భావించి నిందలు వేస్తారో ఒక పట్టాన బోధపడడం లేదు. రెండు రాష్ట్రాల గవర్నర్ పదవిలో ఉన్నందుకు ఇటు చెంపదెబ్బ, అటు గోడదెబ్బ అన్నట్లుగా ఆయన అన్ని రాజకీయ పక్షాల నాయకుల నుంచి నిందలు భరించాల్సి వచ్చేలా పరిస్థితులు తయారవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే..

గవర్నరు నరసింహన్ గత కేంద్రప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నియమితులైన వ్యక్తి. ఆ ప్రకారం ఆయన కాంగ్రెస్ వాది అనుకుని, ఆ పార్టీకి విధేయుడుగా ఉంటారేమో అని అనుకోవాలి. ఈ మాజీ పోలీసు బాస్ అప్పట్లో అలాగే మెలగారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తెరాస నాయకులు ఈయనను తిట్టని తిట్టు లేదు. విభజన అనేది ఈయన చేతుల్లోని వ్యవహారం అయినట్లుగా, ఆయనే అడ్డుపడుతున్నట్లుగా ఆడిపోసుకున్నారు.

విభజన తర్వాత.. ఏపీలో రాజభవన్ కూడా లేకపోవడంతో.. రెండు రాష్ట్రాలకు ఆయనే దిక్కయ్యారు. మొత్తానికి ఏదో ఆపద్ధర్మంగా నడిపిస్తున్నారు. ఆయన పదవీకాలం కూడా పూర్తయిపోతే.. ఆశ్చర్యకరంగా.. భాజపా కేంద్రప్రభుత్వం ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. అంటే ఆయన అంతలా కొత్తగా వచ్చిన భాజపా సర్కారుకు కూడా విధేయత కనబరిచారన్నమాట. ఈలోగా.. అదివరలో తెగతిట్టిన తెరాస వారితోనూ మంచి మైత్రి ఏర్పడింది. తీరా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాదులు ఆయనను చెడామడా తిట్టిపోస్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఏజెంటుగా మారారని ఆరోపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లు అన్నీ ఒక ప్రహసనం అయితే.. ఏపీ వ్యవహారాల్లో ఆయనను భాజపా నాయకులు కూడా ఒక రేంజిలో విమర్శించడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం పంపిన నాలా బిల్లును తొక్కిపెట్టి.. అక్కడ పారిశ్రామిక ప్రగతికి అడ్డుపడుతున్నారనేది ఆరోపణ.

ఇలా అన్ని పార్టీల వారూ విడవకుండా నిందలు వేస్తోంటే.. ఇంతకూ గవర్నర్ నరసింహన్ ఎవరికి అనుకూలమైన వ్యక్తి అనే సందేహాలు ప్రజలకు కలగడంలో వింతేముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.