గుడ్‌బై చెప్పే యోచనలో గోరంట్ల..!

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉన్న అతి తక్కువ మంది నాయకుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత కొద్దికాలంలోనే కీలక నేతగా మారిపోయారయన. రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్లలో వివాదాలకు దూరంగా ఉన్న ఆయన.. అప్పుడప్పుడు ప్రత్యర్ధులపై తనదైన శైలిలో విమర్శానాస్త్రాలు సంధిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబుకు కూడా సలహాలు ఇచ్చే గోరంట్ల.. కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ టీడీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు గోరంట్లలో కూడా నిరాశను నింపింది. సీనియారిటీ పరంగా తనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిరోజులకు శాంతించిన ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్లకు సంబంధించిన ఓ వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గోరంట్ల.. ఐదు సార్లు విజయం సాధించారు. 2009లో రాజమహేంద్రవరం అర్భన్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీతో పొత్తు వల్ల గత ఎన్నికల్లో తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఇప్పుడు టీడీపీ.. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి రెండు స్థానాల్లో ఎటువంటి అడ్డు ఉండదని భావించారు. ఇలాంటి సందర్భంలోనే గుడా చైర్మ‌న్ గ‌న్ని కృష్ణ‌ పేరు తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అర్బన్ సీటు కన్ఫార్మ్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో గోరంట్లలో కొత్త టెన్షన్ మొదలైందట. గన్ని కృష్ణ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండు స్థానాలు ఆ వర్గానికే ఇవ్వడం కుదరదు. సో.. గోరంట్లకు ఈ సారి పోటీ చేసే అవకాశం లేదని టీడీపీలో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే గోరంట్ల రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరో పార్టీలోకి వెళ్లడం కంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సన్నిహితుల దగ్గర అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.