గూఢచారి మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్ట డ్రీమ్ మర్చంట్స్
నటీనటులు: అడివి శేష్‌, శోభితా దూళిపాళ‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, మ‌ధుశాలిని, అనీష్ కురివెల్ల‌, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: శ‌నీల్ డియో
మాట‌లు: అబ్బూరి ర‌వి
ఎడిటింగ్: గారి బి.హెచ్‌
క‌థ‌: అడివిశేష్‌
స్క్రీన్‌ప్లే: అడివిశేష్‌, రాహుల్, శ‌శికిర‌ణ్ తిక్క‌
నిర్మాత‌లు: అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
ద‌ర్శ‌క‌త్వం: శ‌శి కిర‌ణ్ తిక్క‌

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి ప్రవేశించిన అడవిశేష్ అప్పుడప్పుడు దర్శకత్వం విభాగంలోనూ, కథలు రాయడంలోనూ మెరిశాడు. అతడు నటించిన క్షణం సినిమాతో తనలో మంచి రైటర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఆ సినిమాలో అదిరిపోయే స్ర్కీన్‌ప్లే పండించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. భారీ హిట్ తర్వాత సినిమాలకు చాలా కాలం దూరమైన అడవి శేష్.. జేమ్స్‌బాండ్ తరహా కథతో చేసిన ప్రయత్నమే ‘గూఢచారి’. హాలీవుడ్‌లో తరచూ వచ్చే ఈ తరహా కథలు తెలుగులో పలుమార్లు పలకరించి వెళ్లిపోయాయి. 2004లో రాసుకున్న కథ ఇది అని చెబుతున్నాడు అడవి శేష్. మరి ఇలాంటి జోనర్‌ను ఎంచుకున్న అడవి శేష్ సక్సెస్ అయ్యాడా..?

కథ
గోపి(అడివి శేష్‌) తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్నలాగే సీక్రెట్‌ ఏజెంట్‌ కావాలనుకుంటాడు. ఓ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో అతడి తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి గోపిని తండ్రి స్నేహితుడైన సత్య(ప్రకాష్‌రాజ్‌), అర్జున్ అని పేరు మార్చి పెంచుతాడు. తన తండ్రిలా దేశం కోసం ప్రాణాలు కోల్పోతాడనే భయంతో సీక్రెట్ ఏజెంట్ అవుతానంటే వారిస్తుంటాడు. అయినా, పట్టు విడువని అర్జున్ ఉద్యోగం కోసం ఏకంగా 170 సార్లు దరఖాస్తు చేసుకుంటాడు. చివరకు త్రినేత్ర ఏజెన్సీ అర్జున్‌కు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి ‘గూఢచారి 116’గా నియమిస్తుంది. అదే సమయంలో సమీరా(శోభిత దూళిపాల)తో ప్రేమలో పడతాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న అర్జున్ అనుకోని కారణాలతో ఓ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో అతడిపై దేశ ద్రోహి అనే ముద్ర పడుతుంది. మరి దీని నుంచి అర్జున్ ఎలా బయటపడతాడు..? దీని కోసం అసలేం చేశాడు..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
క్షణం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అడవి శేష్ రాసిన కథ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందనే చెప్పాలి. జేమ్స్‌బాండ్ తరహాలో సాగే కథ ఇది. అడవి శేష్ ఈ సినిమా కథను చాలా చక్కగా రాసుకున్నాడు. మంచి కథతో పాటు ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరిత సన్నివేశాలు, మధ్య మధ్యలో ఊహించని ట్విస్టులతో సినిమా ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుడు కథలోకి లీనమైపోతాడు. అయితే, మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కొంచెం ఇబ్బంది కలిగించినా.. అది కూడా కథలో భాగమేననే ఫీల్ కలుగుతుంది. అప్పటి వరకు కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. ఇంటర్వేల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఇక, సెకెండాఫ్ నెమ్మదిగా ప్రారంభమైనా, జగపతిబాబు ఎంట్రీతో ఊపందుకుంటుంది. తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండవు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టుతో సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. చివర్లో దేశభక్తితో కూడిన క్లైమాక్స్‌తో సినిమా ముగియడంతో ప్రేక్షకుడు కొంత ఉద్వేగానికి లోనైపోతాడు. మొత్తంగా సినిమా ఈ తరహా చిత్రాలు చూసేవారినే కాకుండా సగటు ప్రేక్షకుడిని కూడా మెప్పిస్తుంది.

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు
హీరోగా అడివి శేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. తన తండ్రిలా అవ్వాలని కలలు కనే పాత్రలో, రా ఏజెంట్ పాత్రలో, ఉగ్రవాది అని ముద్రపడిన సందర్భంలో అతడి నటన, పండించే హావభావాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాతో హీరోగానే కాకుండా మంచి రైటర్‌గా కూడా అతడు సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ తెలుగమ్మాయే కావడంతో ఆమె కూడా తన పరిధి మేర చక్కగా నటించింది. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత హీరోయిన పాత్ర కనిపించదు. ఇక, హీరోని పెంచి పెద్ద చేసే పాత్రలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన సుప్రియ, తదితర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. డైరెక్టర్ విషయానికొస్తే, మంచి సస్పెన్స్ కథను చాలా బాగా డీల్ చేసి విజయం సాధించాడు. ఇలాంటి కథను ఎలా డీల్ చేయాలో డైరెక్టర్ అదే ఫాలో అయ్యాడు. ఈ సినిమాకు మరో హైలైట్ అంటే బ్యాగ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల ప్రాణం పెట్టి చేసినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా సహజంగా ఉంటాయి. అయితే, ఈ సినిమాకు ఇంకెంచెం బడ్జెట్ పెట్టి ఉంటే సినిమా ఇంకా రిచ్‌గా కనిపించేది. లో బడ్జెట్ సినిమా అయినా కెమెరామెన్ అలా కనిపించనీయలేదు. ఎడిటింగ్, మాటలు అన్నీ చక్కగా కుదిరాయి.

బలాలు
* నటీ నటులు
* స్ర్కీన్‌ప్లే
* యాక్షన్ ఎపిసోడ్స్
* బ్యాగ్రౌండ్ స్కోర్
* ట్విస్టులు

బలహీనతలు
* అక్కడక్కడా హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపించడం

మొత్తంగా: ఈ ‘గూఢచారి’ మెప్పిస్తాడు

రేటింగ్: 3.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.