గీత గోవిందం మూవీ రివ్యూ

సంస్థ‌: జిఎ2 పిక్చ‌ర్స్
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌ త‌దిత‌రులు
సంగీతం: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
పాటలు‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి
స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌
నిర్మాత‌: బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ప‌రుశురామ్‌

‘పెళ్లి చూపులు’లో డీసెంట్‌గా కనిపించి.. ‘అర్జున్‌రెడ్డి’తో బోల్డ్‌అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ దేవరకొండ. ఆ సినిమాకి వచ్చిన ఫలితం తర్వాత అతడి క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావించిన విజయ్.. ‘గీత గోవిందం’లా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత సమర్పణలో రావడంతో పాటు విజయ్ దేవరకొండ‌కు ఉన్న క్రేజ్‌తో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందునా ఇటీవల విడుదలైన ట్రైలర్, ‘ఇంకేం కావాలే’ పాట కుర్రకారును సినిమా వైపు ఆకర్షించింది. దీంతో రిలీజ్‌కు ముందు సినిమాకు ఎంత ప్రచారం కావాలో అంత దొరికేసింది. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..?

క‌థ
విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో విజయ్‌ను, అతడి చెల్లెలిని తండ్రి(నాగబాబు) అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన విజయ్.. తనకు కాబోయే భార్య తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. రోజూ ఇవే కలలు కంటూ ఉంటాడు. ఓ రాత్రి అతడికి వచ్చిన కలలో ఉన్న అమ్మాయి నిజ జీవితంలో ఎదురవుతుంది. ఆమె పేరే గీత (రష్మిక మందన్న). తను కోరుకున్న లక్షణాలు కూడా ఉండడంతో ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇలాంటి సందర్భంలో బస్సులో మరోసారి కలుసుకుంటారు. ఆ సమయంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. దీంతో గీత, విజయ్‌ను అసహ్యించుకోడంతో పాటు తన అన్నయ్యకు చెబుతుంది. అప్పుడు విజయ్ ఏం చేశాడు..? గీత అన్నయ్య విజయ్‌ను ఏం చేశాడు..? ఇంతకీ గీతకు విజయ్ మీద అసహ్యం కలగడానికి కారణమేంటి..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
సినిమా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ప్రారంభమవుతుంది. నిత్య మీనన్‌కు విజయ్ తన కథను చెప్పడంతో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. లెక్చరర్‌గా పని చేస్తున్న విజయ్‌కు కలలో కనిపించిన అమ్మాయి నిజ జీవితంలో ఎదురు పడడం, మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోవడం, అంతలోనే హీరోయిన్.. హీరోని అసహ్యించుకోవడం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను కథలోకి వెళ్తారు. ఇక అప్పుడు ఓ ట్విస్ట్‌తో కథ మలుపు తిరుగుతుంది. విజయ్‌ను అసహ్యించుకునే గీత అతడితోనే కలిసి ఉండాల్సి రావడం.. వాటిని కామెడీ యాంగిల్‌లో చూపించడంతో మొదటి భాగం ముగుస్తుంది. రెండో భాగంలో గీత అన్నయ్య సుబ్బరాజు, విజయ్‌ అంతు చూడడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే క్రమంలో సుబ్బరాజు తనకు కాబోయే బావ అనే విషయం తెలుస్తోంది. అప్పుడు తన చెల్లి పెళ్లి ఆగిపోకుండా విజయ్ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. అప్పుడు ఎంటరైన వెన్నెల కిశోర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి పోతాడు. మొదటి షాట్ నుంచి ప్రతీ సీన్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉండటంతో సినిమా ఫీల్‌గుడ్‌గా సాగిపోతుంది. ప్రీ క్లైమాక్స్‌లో గీత పెళ్లి ప్రపోజల్‌ను వ్యతిరేకించడం, క్లైమాక్స్‌లో ఆమెనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం అనే అంశాలకు చక్కటి డైలాగ్స్, ఫీల్‌గుడ్ సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది.

నటీనటుల పనితీరు
సినిమాలో ప్రథమంగా చెప్పుకోవాల్సింది హీరో హీరోయిన్ల గురించే. హీరో విజయ్ దేవరకొండ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అర్జున్‌రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేసిన సినిమానే అయినా దాని ప్రభావం కనిపించకుండా మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. అలాగే హీరోయిన్ రష్మిక కూడా తనలోని టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టినట్లు అనిపిస్తుంది. గ్లామర్‌గా కనిపిస్తూనే ఆమె పండించిన అభినయం అదిరిపోతుంది. కొన్ని చోట్ల విజయ్‌ను డామినేట్ చేసేలా నటించింది కూడా. ఇక హీరోయిన్ అన్న పాత్ర చేసిన సుబ్బరాజు ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో ఆకట్టుకున్నాడు. కమెడియన్స్ రాహుల్, వెన్నెల కిశోర్ మరోసారి తమ టాలెంట్ చూపించారు. ఇక, నాగబాబు, అన్నపూర్ణమ్మ తదితర నటులు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.

టెక్నీషియన్ల పనితీరు
ఇందులో అందరికంటే ముందు దర్శకుడు పరశురామ్ గురించే చెప్పుకోవాలి. ‘సోలో’ సినిమాలో బలమైన కథలో కామెడీ యాంగిల్ జోడించి ప్రేక్షకుల మెప్పుపొందిన ఈయన.. ఇప్పుడు కూడా అదే తరహా ఫార్ములాతో వచ్చాడు. కథ అంత బలమైన కాకపోయినా.. బలమైన సన్నివేశాలను రాసుకుని మంచి ఔట్‌పుట్ రప్పించాడు. ఫలితంగా అతడిలో మంచి ర‌చ‌యిత ఉన్నాడ‌ని ఈ చిత్రంతో మ‌రోమారు రుజువైంది. ఒక బోల్డ్ సినిమా చేసిన హీరోను గోవిందంలాంటి క్యారెక్టర్ చేయించడంలోనే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ రావడానికి కారణమయ్యాడు. ‘ఇంకేం కావాలే’ అంటూ వచ్చే పాట సినిమాకు హైలైట్‌గా నిలిచింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా చేశాడు. సినిమాటోగ్రఫర్ కూడా తన పనితనంతో మెస్మరైజ్ చేశాడు. కాకపోతే ‘ఇంకేం కావాలి..’ పాట చిత్రీక‌ర‌ణ‌పై మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవా‌ల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

బలాలు
* విజయ్ దేవరకొండ యాక్టింగ్
* రష్మిక గ్లామర్, ఫెర్ఫార్మెన్స్
* పరుశురాం దర్శకత్వం
* ఎంటర్‌టైన్‌మెంట్

బలహీనతలు
* కొన్ని సన్నివేశాలు బలంగా లేకపోవడం
* చక్కని పాటలకు తగ్గ పిక్చరైజేషన్ కనిపించకపోవడం

మొత్తంగా: గోవిందుడు నవ్విస్తాడు

రేటింగ్: 3.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.