వైసీపీయా?.. జనసేనా?.. గంటా శ్రీనివాసరావు దారేది?

గంటా శ్రీనివాసరావు.. పుట్టింది నెల్లూరు జిల్లా అయినా పెరిగిందంతా విశాఖలోనే. అక్కడే వ్యాపారం ప్రారంభించి ఊహించని విజయం సాధించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంటా 1999లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపు పదివేల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభావంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

మంత్రి కావాలనే కోరిక ఉన్న గంటా 2009లో పార్టీ మారారు. ప్రతిపక్ష టీడీపీని వీడి అప్పుడప్పుడే ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మెగాస్టార్ చిరంజీవితో గంటాకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో టికెట్ల వ్యవహారం కూడా తానే చూశారు. ఈ నేపథ్యంలోనే తనకు రాజకీయ ప్రస్థానాన్ని ఇచ్చిన అనకాపల్లి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా గంటా విజయం సాధించారు. అయితే ఎన్నో ఆశలతో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ 294 సీట్లలో కేవలం 18 సీట్లను మాత్రమే అతికష్టం మీద సాధించి నిరాశ మిగిల్చింది. ఇక చేసేది లేక తన 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేశారు. కాంగ్రెస్‌లో మారుతున్న పరిణామాలతో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన హయంలో గంటా కోరిక నెరవేరింది. నల్లారి కేబినెట్‌లో గంటా మంత్రి అయ్యారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తలెత్తుకోలకేపోయింది. ప్రజారాజ్యం కూడా ఆ పార్టీతో కలిసి విశ్వాసం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని గ్రహించిన గంటా తిరిగి సొంత గూటికి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబునాయుడి కేబినెట్‌లో మంత్రి పదవి సంపాదించారు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.

ఇలా ఓటమి ఎరుగని నేతగా గంటా శ్రీనివాసరావు రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గంటా పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. సొంత జిల్లాలో మంత్రి అయ్యన్నపాత్రుడితో విభేదాల కారణంగా క్యాడర్‌లో అసంతృప్తి ఉంది. అంతేకాకుండా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని ఇటీవలి సర్వేలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయం గంటాలో కలుగుతోంది. పోనీ.. తనకు అనుకూలమైన అనకాపల్లి సీటు అడుగుదామన్నా.. జిల్లాలోని రాజకీయ సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు అందుకు అంగీకరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో గంటా ముందు ఉన్నది ఒకటే ఆప్షన్.. పార్టీ మారడం. అయితే ఆయన వైసీపీలోకి వెళతారా? లేక అన్నయ్యకు ప్రియమైన తమ్ముడు ప్రారంభించిన జనసేనలోకి వెళతారా అనేది తేలాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ హోరాహోరీ పోటీ ఉండడంతో రెండింటిలో ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్పడం కష్టమే. జనసేన కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండడంతో ఏపీలో కర్ణాటక పరిస్థితి ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. అందుకే టీడీపీ గెలిచినా.. వైసీపీ గెలిచినా తన గెలుపు మాత్రం పక్కాగా ఉండాలనేది గంటా భావంగా కనిపిస్తోంది. జనసేనలో అయితే గంటాకు కోరిన స్థానం నుంచి టికెట్టు వస్తుంది. ఈ క్రమంలో జనసేన తరపున అనకాపల్లిలో పోటీ చేస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చేనది గంటా మదిలో ఉన్న ఆలోచన అని అంటున్నారు. అయితే వైసీపీ కూడా గంటాకు ఆఫర్స్ ఇస్తోందని ఇటీవల వార్తలు వినిపించాయి. కావాలంటే గంటాకు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ టాక్. ఈ నేపథ్యంలో గంటా దారి ఏపార్టీ వైపు వెళుతుందో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.