టీడీపీకి తలనొప్పిగా మారిన గంటా, అయ్యన్న!

టీడీపీలో ఆ ఇద్దరు మంత్రుల మధ్య అస్సలు పొసగడం లేదు. గడచిన నాలుగేళ్లుగా ఇద్దరూ ఉప్పు, నిప్పులానే వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు చీవాట్లతో కలిసిపోయినట్టు ఒకరినొకరు హత్తుకుని ఫొటోలకు ఫోజులిచ్చినా కొద్దిరోజుల తరువాత షరా మామూలే. కొంతకాలంగా అయితే మంత్రులిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఒకరినొకరు పలకరించుకోవడం లేదు సరికదా కనీసం ముఖాలు కూడా చూసుకోవడం లేదు. వాళ్లే విశాఖ జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు ఎన్నిసార్లు నచ్చచెప్పినా వీళ్ల మధ్య విబేధాలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మరోసారి వీరి మధ్య ఎడమొహం-పెడమొహం కనిపించింది.

ఈనెల 11న విశాఖలోని ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో మంత్రులు ఇద్దరూ పాల్గొన్నారు. వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు చెబుతూ గుండెలకు హత్తుకున్నారు. వీరు మాత్రం కనీసం మర్యాద కోసమైనా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం నాయకులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం ప్రసంగం వినేందుకు వచ్చిన మంత్రి అయ్యన్నపాత్రుడు హాలులో కూర్చోగా, ఆయన పక్కన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూర్చున్నారు. ఆ తరువాత వచ్చిన గంటా శ్రీనివాసరావు గణబాబు పక్కన కుర్చీలో ఆశీనులయ్యారు. అంటే ఇద్దరి మధ్య గణబాబు ఉన్నారు.

ఇరువురు మంత్రులు దాదాపు ముప్పావు గంట వరకు అక్కడే ఉన్నా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు. ఒకరితో మరొకరికి సంబంధం లేనట్టుగా ముభావంగా ఉండిపోయారు. జిల్లాకు అన్ని రకాలుగా నేతృత్వం వహించాల్సిన మంత్రుల సఖ్యత లేక పోవడం అటు పార్టీ, ఇటు జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఇరువురి మధ్య ఎన్నో సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. 2014లో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలోకి రావడాన్ని అయ్యన్న బాహాటంగా వ్యతిరేకించారు. అయితే గంటా భీమిలిలో గెలిచి విజయం సాధించి మంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇరువురు పరస్పర ఆరోపణలు చేసుకునేవారు. ముఖ్యమంత్రి పలుమార్లు పిలిచి మాట్లాడడంతో కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేసుకోవడం లేదు కానీ సందర్భం వస్తే తప్పులు ఎత్తిచూపడానికి వెనకాడడం లేదు.

జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు తగ్గట్టు రెండు వర్గాలుగా ఉండేవారు. ఆ మంత్రి పక్కన కొందరు, ఈ మంత్రి వైపు కొందరు తిరిగేవారు. ఇది విభేదాలకు తావిస్తుండడంతో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు పిలిచి హెచ్చరించడంతో అంతా ఒక వర్గంగా మారిపోయారు. ఎవరితో పని ఉంటే వారి దగ్గరకు వెళ్లి చేయించుకుంటున్నారు. మంత్రుల మధ్య సఖ్యత కోసం తొలుత జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ప్రయత్నించారు. ఆయన తరువాత హోంమంత్రి చినరాజప్పకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా ఇద్దరినీ కలపలేకపోతున్నారు.

మంత్రులు ఇద్దరూ కలిసి జిల్లాలో ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు నిర్వహించిన సందర్భాలు అతి తక్కువ. తరచూ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించాలన్న అధినేత ఆదేశాలు అమలు కావడం లేదు. ఇక జిల్లాకు సంబంధించిన సీనియర్లకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టే విషయంలో కూడా అయ్యన్న, గంటాలు కలిసి పనిచేయలేదని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా సీఎంను కలిసి ‘మాకు ఇది కావాలి’ అనే అడిగిన సందర్భాల్లేవని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో వీరి మధ్య విభేదాలు కొనసాగితే పార్టీకి ఇబ్బందికరమనేది అందరి అభిప్రాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.