మాజీలు ఏ గూటికి చేర‌తారో!

ఒక‌ప్ప‌టి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన నేత‌లు. అధికారంలో ఉండ‌గా.. ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కులు. ప‌ద‌వులు పోగానే.. మాజీల‌య్యారు. జ‌నంలోనూ ప‌లుచ‌న‌య్యారు. కొత్త‌రాజ‌కీయాల ఖ‌ర్చును భ‌రించ‌లేక‌నో.. ఎందుకీ పోటీ అనో వెనుకంజ వేశారు. వీరిలో టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు అధికం. కొంద‌రు.. పార్టీ మారి వేరే కండువా క‌ప్పుకున్నారు. ఇంకొంద‌రు ఆత్మాభిమానం చంపుకోలేక‌.. రాజ‌కీయాల‌కూ దూరంగా ఉంటున్నారు. వారిలో దాడి వీర‌భ‌ద్ర‌రావు, ల‌గ‌డ‌పాటి రాజగోపాల్‌, స‌బ్బంహ‌రి, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, చెన్నుపాటి విద్య ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏపీలో డ‌జ‌న‌కు పైగా పెద్ద త‌ల‌కాయ‌లే లెక్క‌కు తేల‌తాయి. ఇక మ‌నం మాజీల‌మే అనుకుంటున్న వీరంద‌రికీ 2019 ఎన్నిక‌ల ర‌ణ‌రంగం ఆశ‌లు రేకెత్తిస్తోంది. ఒక్క ఛాన్స్‌.. అయితే మంత్రి.. గాక‌పోతే.. మ‌ళ్లీ వెన‌క్కి.. రెండే రెండే ఆప్ష‌న్లు వారిలో ఆశ‌లు రేకెత్తించి.. క‌స‌ర‌త్తులు చేయిస్తున్నాయి. ఈ లెక్క‌న కురువృద్ధుడు.. మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌కు కూడా.. సూచ‌న‌లు.. స‌ల‌హాల కోసం ఏదో ఒక పార్టీ మంత‌నాలు జ‌రిపే అవ‌కాశ‌మూ ఉంది.
ఎలాగంటే.. 2014లో తెలంగాణ‌లో కేసీఆర్ సీఎం కాగానే.. డీఎస్‌, కేకే వంటి సీనియ‌ర్ల‌ను పార్టీలోకి ఆహ్వానించ‌టానికి ఢిల్లీలో ఎలా చ‌క్రం తిప్పాల‌నే స‌ల‌హాలు తీసుకునేందుకే అనే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. ఇప్పుడు ఏపీలోనూ అదే పంథాలో జ‌న‌సేన‌, టీడీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు.. ఉండ‌వ‌ల్లి, రాజ‌గోపాల్‌, హ‌రి త‌దిత‌ర నేత‌ల గ‌ణానికి గాలం వేస్తున్నారు. రా.. ర‌మ్మంటూ మ‌ధ్య‌వ‌ర్తుల‌తో మంత‌నాలూ సాగిస్తున్నారు. నేత‌ల రాకతో ఓట్ల బలం పెర‌గ‌టం సంగ‌తి ఎలా వున్నా.. ప్ర‌త్య‌ర్థిని ఎలా దెబ్బ‌తీయాల‌నే చిటుకులు చెబుతార‌నేది దాదాపు అన్ని పార్టీల ఆశ‌. ల‌గ‌డ‌పాటి వంటి వారైతే.. స‌ర్వేల పాపారాయుడుగా గురిచేసి జ‌యాప‌జ‌యాల‌ను అంచ‌నా వేయ గ‌ల‌రు. పైగా.. ఆయ‌న స‌ర్వేలు ముందుగా బ‌య‌ట‌కు వ‌స్తే.. త‌మ గెలుపును ప్ర‌భావితం చేస్తాయ‌నే ఆశ‌లు కూడా చాలామంది నాయ‌కుల్లో ఉన్నాయి. అందుకే.. మీరు ఎటువైపు ఉన్నా.. మాకు మాత్రం.. స‌ర్వేల‌పై కాస్త సాయం చేయ‌మంటూ ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు ల‌గ‌డ‌పాటి వ‌ద్ద‌కు చేరి మంత‌నాలు జ‌రిపార‌ట‌. ఈ లెక్క‌న‌.. మ‌ళ్లీ ఓల్డ్ ఈజ్‌గోల్డ్ అంటూ.. మాజీల‌కు తాయిలాలు పంచుతూ.. ఎట్ట‌కేల‌కు ద‌స‌రాపండుగ తెచ్చార‌న్న‌మాట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.