సీఎంతో ఉగ్ర భేటీ.. సందిగ్ధంలో బాలయ్య ఫ్రెండ్ బాబూరావు!

ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరబోతున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. పలు అంశాలపై స్పష్టత వచ్చిన అనంతరం ఆయన పార్టీలో చేరికకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో చర్చించి ముహూర్తం ఖరారు చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారట.
ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యవహారాలపై స్వీయ పర్యవేక్షణ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముందుగా పార్టీలో ఉన్న ముఖ్య నేతలతో పలు దఫాలు భేటీ అయి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ప్రారంభించిన ఆయన ఇప్పుడు కొత్తగా పార్టీలో చేర్చుకునే నాయకులపై దృష్టి సారించారు. అందులో భాగంగా కనిగిరి మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో చర్చలు జరిపారు.
కనిగిరి మాజీ శాసనసభ్యుడైన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కొంతకాలం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలి నుంచి కనిగిరి నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే ఆయన గత ఎన్నికల తర్వాత ఉగ్రసేన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిల్లో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మరొకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే డాక్టరు ఉగ్రతో ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడగా ఈ విషయమై గతంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో కూడా కొంతమేర చర్చించినట్లు చెప్తున్నారు. తిరిగి పార్టీ రాష్ట్ర నాయకులు అవసరమైన సమయంలో బాబూరావుతో కూడా మాట్లాడి ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిని డాక్టరు ఉగ్ర కలిసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాబూరావు జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారట. అధినేత చంద్రబాబు బావమరిది, సినీ నటుడు బాలకృష్ణతో ఉన్న స్నేహంతో తన భవిష్యత్‌ను చక్కదిద్దుకునే ఆలోచనలో తమ నేత ఉన్నట్లు బాబూరావు అనుచరులు చెప్తున్నారు. అయితే నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా సీఎంను ఉగ్ర కలవటం చర్చనీయాంశమైంది. అయితే ఈ భేటీలోని ఆంతర్యం గురించి ఉగ్ర నరసింహారెడ్డే స్వయంగా చెప్పుకొచ్చారు. తన సతీమణి డాక్టరు కవితకు ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అందుకే సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. టీడీపీలో చేరిక విషయాన్ని ప్రస్తావించగా తాను రాజకీయాల్లో ఉన్నందున ఇలాంటివి చర్చకు రావటం సహజమేనన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.