రండి బాబూ.. ఫ్యాన్ రెక్క‌ల‌కింద‌కు రండీ!

పాపం మాజీ డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావు విప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌ల‌వ‌ట‌మే పాప‌మైంది. వెంట‌నే క‌థ‌లు అల్లేశారు. ఇంకేముంది.. వైసీపీలోకి చేరేందుకు సిద్ధ‌మంటూ.. ఎంపీ విజ‌యసాయిరెడ్డి చెప్పేశారు. ఇక మ‌న మీడియా అయితే.. ఏకంగా ఒంగోలు ఎంపీ సీటు ఆయ‌న‌కేనంటూ తేల్చేసింది. కానీ, చివ‌ర‌కు.. సాంబ‌శివ‌రావు.. నేను రాజ‌కీయాల్లోకి చేర‌ట్లేదు మొర్రో.. ఏదో క్యాజువ‌ల్‌గా క‌లిశానంటూ మీడియా సాక్షిగా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. పైగా.. చంద్ర‌బాబు విప‌క్షంలో ఉన్న‌పుడు వైజాగ్ వ‌స్తే క‌లిశానంటూ స‌ర్దిచెప్పాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. అయితే.. ఇదంతా యాదృచ్ఛిక‌మా.. నిజంగా సాంబ‌య్య‌గారు.. వైసీపీలోకి చేరుతున్నారా! అనేది మాత్రం ప్ర‌స్తుతానికి ప్ర‌శ్న‌గానే మిగిలింది. సీనియ‌ర్ ఐపీఎస్‌గా సాంబ‌శివ‌రావుకు బ‌ల‌మైన నేప‌థ్య‌మే ఉంది. కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచిప‌ట్టు కూడా ఉంది.
ఇప్ప‌టికీ చాలామంది ఐపీఎస్‌లు ఆయ‌న శిష్యులుగానే చెబుతారు. వైఎస్ సీఎంగా ఉన్న‌పుడు చాలా స‌న్నిహితంగా మెలిగేవారు. పైగా హ‌స్తం పార్టీకు అండ‌గా ఉన్న‌ట్లుగా కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దాదాపు కేబినెట్‌లో ఎవ‌రున్నా ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ల‌గ‌ని విధంగా చ‌క్రం తిప్ప‌గ‌ల‌రు. శాంతిభ‌ద్ర‌త‌లు, న‌క్సలిజం వంటి అంశాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. కొన్ని లోపాలున్నా.. అవ‌న్నీ ఆయ‌న ప‌నితీరుపై ప‌టాపంచ‌ల‌య్యాయ‌నే పేరుంది. చంద్ర‌బాబు సీఎం అయ్యాక‌.. జాస్తి రాయుడును డీజీపీగా తీసుకోవ‌టం ఆయ‌న వెనుక కుల‌ప‌ర‌మైన ప్ర‌యార్టీ ఉంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. అనంత‌రం సాంబ‌శివ‌రావును కేవ‌లం తాత్కాలిక డీజీగానే మూడేళ్ల‌పాటు కొన‌సాగించారు. అనంత‌రం పూర్తిస్థాయిబాధ్య‌త‌లు అప్ప‌గించినా.. మ‌రో ట‌ర్మ్‌కావాలంటూ కేంద్రానికి నివేదిక ఇవ్వ‌లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఉన్నాయి. అయినా.. పోర్టుకు సీఈవో స్థానం క‌ల్పించిన చంద్ర‌బాబు.. చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించారు. అదేస‌మ‌యంలో కాపుల నుంచి వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించారు. కానీ..  ఇప్పుడు.. వైసీపీలోకి మాజీ పోలీసు బాస్ చేరిక‌తో ఈ విష‌యాల‌న్నీ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే.. వైసీపీ తొంద‌ర‌పాటుగానో.. కావాల‌నో.. ప్ర‌చారానికి ఊత‌మిస్తుంది. పార్టీలోకి చేరిక‌లు ఉంటాయ‌నే ప్ర‌చారాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌టం ద్వారా టీడీపీ ప‌ని అయిపోయింద‌నే అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లోకి చేర్చాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్న‌ట్లుగా టీడీపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.