తొలి అభ్యర్ధిని ప్రకటించిన పవన్.. టీడీపీకే నష్టమా..?

ఎన్నికలు సమీపిస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ప్రజలను కలుస్తూనే.. పార్టీనీ బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికలకు.. ప్రస్తుత పరిస్థితులకు రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 2014లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ విడిపోవడం.. ఆ రెండు పార్టీలకు మద్దతు తెలిపిన జనసేన ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగుతుండడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. జనసేన ఎంటరైన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందుకు తగ్గట్లే జనసేనాని పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రారంభించినప్పటి నుంచి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకొంటున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతూ తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరిని బేషరతుగా జనసేనలో చేర్చుకున్నాడు. తాజాగా ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్న తొలి అభ్యర్ధిని ప్రకటించాడు పవన్. అది కూడా టీడీపీ సిట్టింగ్ స్థానంలో కావడం విశేషం.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేనాని వెల్లడించాడు. తన తండ్రిలాగే ఆయన కూడా కానిస్టేబుల్‌గా పని చేశారని, ఆయనకు టికెట్ కేటాయించడంతో తన తండ్రిని గౌరవించినట్లు అవుతుందని ఈ సందర్భంగా పవన్ తెలిపాడు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ.. ఎనిమిదేళ్ల ప్రభుత్వ సర్వీసు ఉన్నా వైసీపీ అధినేత టికెట్ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరారు. దీంతో ఆయనను ముమ్మిడివరం కోఆర్డినేటర్‌గా నియమించాడు. అయితే, వివిధ కారణాలతో పితానిని అర్థాంతరంగా ఆ పదవి నుంచి తప్పించడంతో వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. మరోవైపు ఆయనకు కేటాయించిన స్థానం టీడీపీ సిట్టింగ్ స్థానంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధి దట్ల సుబ్బరాజు వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఇప్పుడు ఇక్కడ అభ్యర్ధిని ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నష్టం కలిగే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రెండు పార్టీలు నిలబెట్టే అభ్యర్ధిని బట్టే అక్కడి ఫలితం ఆధారపడి ఉంటుంది. జనసేన అధినేత ముందు ముందు ఇకెలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూడాలి.

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.