ఫైర్‌బ్రాండ్ అప్‌డేట్: నటిగా ఘనం… ఎమ్మెల్యేగా అనుమానం

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజాకు రానున్న ఎన్నికల్లో సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని అనుకుంటున్నా, ఆమె వ్యతిరేక వర్గం ఆమె మైనస్ పాయింట్లను అవకాశంగా తీసుకుని, సీటు రాకుండా చేయడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్టు భోగట్టా. ఎమ్మెల్యే రోజా షూటింగ్‌ల నిమిత్తం ఎక్కువ సమయాన్ని చెన్నై, హైదరాబాద్‌లలో గడుపుతున్నారని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వద్దకు వెళ్లి వారు ఆరోపణలు చేస్తున్నట్లు  తెలిసింది.  ప్రస్తుతం ఆమె  నియోజకవర్గంలో లేని సమయంలో నగరి నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి  రెడ్డి వారి చెంగారెడ్డి  సోదరుడు చక్రపాణి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.  రోజాకు ప్రత్యామ్నాయంగా ఆయన కార్యక్రమాలను చేస్తున్నట్లు  నియోజక వర్గంలో పేరు సంపాదించారు. దీంతో ఆయనకే నగరి నియోజకవర్గం సీటు దక్కే అవకాశం ఉందని, దానికి తగిన విధంగా ఆయన పావులు కదుపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.  నియోజకవర్గం ప్రజలు ఆమెను ఒక నటిగా అభిమానిస్తూ, ఎమ్మెల్యేగా వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోజాకు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా ఉన్నప్పటికీ,  నియోజకవర్గంలో ఎక్కువ కాలం గడపక పోవడంతో ఆమెపై పార్టీలోని కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  నగరి నియోజకవర్గంత నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి దివంగతనేత ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం నుంచి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు జగదీష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన సతీమణి,ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయిన సరస్వతి ప్రకటన చేశారు. జగదీష్ కాని, ముద్దుకృష్ణమ నాయుడు మరో కుమారుడు భాను ప్రకాష్ కాని పోటీ చేసినట్లయితే వారికి సానుభూతి ఓట్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో నగరి నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణంగా జగన్ మోహన్ రెడ్డి ఈనియోజక వర్గం అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏతావాతా చూస్తుంటే రోజాకు టిక్కెట్టు గండం పొంచివున్నట్లు తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.