‘ఎఫ్2’ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్‌,రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌కాష్ రాజ్‌, ఝాన్నీ, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అన‌సూయ‌, ర‌ఘు బాబు, నాజర్, పృథ్వి, వై.విజ‌య‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు
మ్యూజిక్: దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ: స‌మీర్ రెడ్డి
ఎడిటింగ్: త‌మ్మిరాజు
ప్రొడ్యూసర్స్: శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌
స్టోరీ, డైరెక్షన్: అనీల్ రావిపూడి

ఒకవైపు ఇద్దరు బడా హీరోలు.. మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘ఎఫ్2’. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్ల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న చిత్రం ఇది. అంతేకాదు బడా సంస్థ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదల చేశారు. సంక్రాంతి అల్లుళ్లు అనే ట్యాగ్ లైన్‌ ఉన్న ఈ సినిమాను టైటిల్‌కు తగ్గట్టే కామెడి ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత పూర్తి హోమ్లీ క్యారెక్టర్ చేస్తున్న చిత్రం కావడంతో పాటు అనిల్ రావిపూడి టేకింగ్ బాగుందనే టాక్ రావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా…?

కథ
ఒక ప్రజాప్రతినిధి దగ్గర పీఏగా పని చేస్తున్న వెంకీ(వెంకటేష్)కు హారిక(తమన్నా)తో పెళ్లి అవుతుంది. కానీ, వీళ్ల జీవితం అనుకున్నంత ఆనందంగా గడవదు. హారిక కుటుంబం వెంకీపై డామినేట్ చేయాలని చూస్తోంది. అప్పుడు వెంకీ చాలా ఫ్రస్టేట్ అయిపోతుంటాడు. ఇదే సమయంలో హారిక చెల్లి హనీ(మెహరీన్)ను వరుణ్ యాదవ్(వరుణ్ తేజ్) ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన వెంకీ.. హనీ కుటుంబం గురించి వరుణ్‌కు చెప్పి పెళ్లి చేసుకోవద్దని అంటాడు. అప్పటికే ప్రేమలో మునిగిపోయిన వరుణ్.. వెంకీ మాటలను పట్టించుకోకుండా హనీని పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి వెంకీ ఎదుర్కొనే పరిస్థితినే వరుణ్‌కు కూడా ఎదురవుతుంది. ఆ సమయంలో తమ భార్యలను కంట్రోల్ చేసుకోలేని వీళ్లిద్దరూ పక్కింటి వ్యక్తి చెప్పిన మాటలు విని వేరే దేశం వెళ్లిపోతారు. అక్కడ ఏం జరిగింది..? అసలు వెంకీ, వరుణ్‌కు సలహా ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు..? హారిక, హనీ తమ భర్తలుండే చోటుకు కనిపెట్టారా..? చివరికీ ఈ రెండు జంటలు కలిశాయా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
చిత్ర యూనిట్ ముందు నుంచీ చెబుతున్నట్లు ‘ఎఫ్2’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో సాగే కామెడీ ఎంటర్‌టైనర్. సినిమా మొత్తం ప్రేక్షకుడు నవ్వుకునేలా దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేకపోయినా.. హీరోలు పండించే కామెడీ చిత్రాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. అయితే, ఫస్టాఫ్‌లో ఉన్నంత ఫన్ సెకెండాఫ్‌లో కనిపించదు. అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథ విదేశానికి మారిన తర్వాత నుంచి మరీ సినిమాటిక్‌గా సాగుతుంది. దీనికి తోడు సెకెండాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. మొత్తంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌‌తో పాటు కామెడీని మాత్రమే ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

నటీనటుల పనితీరు
విక్టరీ వెంకటేష్ గత చిత్రాల్లో మిస్ అయిన కామెడీ మొత్తాన్ని ‘ఎఫ్2’లో చూపించేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా వెంకీని తన పాత సినిమాల్లో చూసినట్లు ఉంటుంది. తన కామెడీ టైమింగ్‌తో, తన డైలాగ్ మాడ్యులేషన్‌తో ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాడు. ఫ్రస్టేషన్‌కు గురయ్యే సన్నివేశాల్లో వెంకీ పండించిన కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక మరో హీరో వరుణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇన్ని రోజులు సెటిల్డ్ పాత్రలకే పరిమితమైన అతడు.. ఈ సారి పూర్తి కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీని పంచాలనుకున్నా అది క్రుతకంగా అనిపిస్తుంది. తమన్నా ఎప్పటిలాగే బాగా చేయగా.. పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేదు అని పేరు ఉన్న మెహరీన్ కూడా ఈ సినిమాలో తన తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తోంది. అలాగే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఒకప్పటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో నవ్విస్తారు. ముఖ్యంగా హరితేజకు ఆయనకు మధ్య వచ్చే హాస్య సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తోంది. సీనియర్ నటులు నాజర్, ప్రకాష్ రాజ్, అలాగే ప్రకాష్ రాజ్ కొడుకులుగా నటించిన సుబ్బరాజు మరియు సత్యం రాజేష్‌లు కూడా తమ నటనతో మెప్పిస్తారు.

టెక్నీషియన్ల పనితీరు
వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి రచయితగా, దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా ఆద్యంతం నవ్వులు పూయించినా.. ఆయన కథ, కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా పర్వాలేదనిపించాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని యూరప్ సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కొన్ని బోరింగ్ సీన్ల విషయంలో ఆయన తన కత్తెరకు పని చెప్పి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు
* వెంకీ నటన
* ఫస్టాఫ్
* సినిమాటోగ్రఫీ
* కామెడీ సీన్స్

బలహీనతలు
* సెకెండాఫ్
* కథ, కథనం
* సినిమాటిక్ సీన్స్

మొత్తంగా: సంకాంత్రి అల్లుళ్లు బాగా నవ్వించేశారు

రేటింగ్: 3.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.