సీఎం సిగ్నలిచ్చిన వెంటనే.. టీడీపీలోకి మరో మాజీ మంత్రి

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. అక్కడ మరోసారి విజయబావుటా ఎగురవేయాలని చూస్తోంది. అందుకోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై కన్నేసింది. వాటిని టార్గెట్‌గా పెట్టుకున్న ఆ పార్టీ.. ఈ సారి వీళైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాపులర్ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. అలాంటి వారిపై అధికార పార్టీ దృష్టి సారించింది. వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టొచ్చని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు, కొందరు ముఖ్య నేతలు సైకిల్ ఎక్కేశారు. ఇంకొంత మంది సమయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి గురించి ఓ వార్త బయటికొచ్చింది. ఈ వార్త విన్న తర్వాత టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీలో మాత్రం కలవరం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేత..?

కొండ్రు మురళీ మోహన్.. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేత. కాంగ్రెస్ హయాంలోని కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేసిన ఆయన.. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు మాజీ మంత్రి కొండ్రు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన ఆయనకు మొదట వైసీపీ గాలం వేసింది. అయితే ఆ స్థానంలో వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు ఉండడం వల్ల ఆయనకు వేరే స్థానంలో టికెట్ ఇస్తామని చెప్పారని, అందుకు కొండ్రు అంగీకరించలేదని సమాచారం. ఈ విషయం తెలిసిన టీడీపీలోని కొందరు ముఖ్య నేతలు ఆయనను కలిసి చర్చలు జరిపారట. ఈ చర్చలు సఫలం అవడంతో ఆయన టీడీపీలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అదే స్థానంలో గతంలో పోటీ చేసిన టీడీపీ సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతికి రాజ్యసభ సభ్యత్వమో, ఎమ్మెల్సీనో ఇచ్చి.. కొండ్రుకు రాజాం అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని సదరు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ విషయం చంద్రబాబు వరకు చేరిందని, ఆయన కొద్దిరోజులు వేచి చూడాలని ఆ నేతలతో చెప్పారని వార్తలు వస్తున్నాయి. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కొండ్రు సైకిల్ ఎక్కుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.