జనసేనానికి ఝలక్.. టీడీపీలోకి మాజీ మంత్రి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచాడు. ఇప్పటి వరకు ప్రజా సమస్యలపైనే దృష్టి సారించిన ఆయన.. ఇకపై పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయన చేపడుతున్న ప్రజాపోరాటయాత్రలోనే పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగా ఆయన ఏ జిల్లాలో పర్యటన చేస్తే.. అక్కడ తటస్థంగా ఉన్న నేతలను నేరుగా, ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలను రహస్యంగా కలుస్తున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ, కొద్దిరోజుల కిందట ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సందర్భంగా పవన్.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కలిశాడు. ఆ సందర్భంలో ఆయనను జనసేనలోకి రావాలని ఆహ్వానించాడు. దీనికి దాడి త్వరలోనే తన నిర్ణయం చెబుతానని పవన్‌తో చెప్పాడని వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి.. తర్వాత వైసీపీలో చేరడం.. అక్కడ ఇమడలేక పార్టీ నుంచి బయటికి వచ్చేశారు దాడి వీరభద్రారావు. అప్పటి నుంచి ఆయన, తన తనయుడు రత్నాకర్‌ తటస్థంగా ఉన్నారు.

పవన్ ఆహ్వానించిన తర్వాత వీరిరువురూ జనసేనలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇందుకు గానూ, దాడికి అనకాపల్లి పార్లమెంట్, రత్నాకర్‌కు అనాకపల్లి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారనే ప్రచారం జరిగింది. అయితే, వాస్తవానికి జనసేనలో చేరే విషయాన్ని దాడి, ఆయన కుమారుడు లైట్ తీసుకున్నారట. అంతేకాదు, పవన్ పిలిచినంత మాత్రాన ఆ పార్టీలోకి వెళ్తే తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుందనుకున్న వారు, ఆ పార్టీలోకి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దాడి.. వైసీపీ నుంచి వచ్చిన వెంటనే టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు. అయితే, అప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవడంతో సైలెంట్‌గా ఉండిపోయారు. తాజాగా ఏపీకి చెందిన ఓ మంత్రి.. దాడి వీరభద్రరావును టీడీపీలో చేర్చుకునే విషయాన్ని సీఎం ముందు ఉంచారట. దీనికి ‘‘టికెట్‌పై హామీ ఇవ్వలేమని చెప్పి, ఇష్టమైతే రమ్మనండి’’ అని చెప్పారట. ఇదే విషయాన్ని దాడి ముందుంచిన మంత్రి.. ఆయనను ఒప్పించారని తెలుస్తోంది. దీని ప్రకారం దాడి, ఆయన కుమారుడు త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.