టీడీపీ ఎంపీనీ వదలని కాంగ్రెస్

విభజన కారణంగా ఏపీ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ దోషిగా మిగిలిపోయింది. దీని ఫలితంగానే గత ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో కాంగ్రెస్‌ ఏపీలో తన ఉనికిని కోల్పోయింది. ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను తిరిగి సొంత గూటికి తీసుకురావాలని హైకమాండ్ భావించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి, ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్ర విభజన తర్వాత పార్టీని విడిచిపెట్టిన నాయకులందరితో పాటు, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి తనతో పాటు తిరిగి పార్టీలో చేరాల్సిందిగా కోరారట. మరో పక్క జగన్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను, అధికార టీడీపీలో ఉన్న నేతలను కూడా కిరణ్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్‌తో పోసగాలేక, అటు చంద్రబాబు దగ్గరకు వెళ్లలేక ఉన్న వారిని, అధికార పార్టీలో ఉండి, అధిష్టాన తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ ఎంపీకి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

నర్సరావుపేట నుంచి టీడీపీ తరపున ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావుతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మూడు సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ఆయన.. ఇటీవల టీడీపీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ఆ పదవి ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న కారణంగానే కాంగ్రెస్ ఆయనతో మంతనాలు జరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి ప్రతిగా రాయపాటి టీడీపీని వీడబోయేది లేదని స్పష్టం చేశారట. కాంగ్రెస్ అన్యాయం చేయడం వల్లే తాను టీడీపీలో చేరానని, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలోకి రాలేనని తేల్చేశారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.