ముందస్తుకు అడ్డుగా మారిన చంద్రబాబు నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు సీఎం కేసీఆర్. అందుకోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి మోదీని, ఇతర మంత్రులను, ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఈసీ చేతిలో ఉంది. సెప్టెంబర్‌ 2నే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు క్షేత్రస్థాయిలో కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే డిసెంబర్‌లో ఎన్నికలు జరగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యాయట. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న కేసీఆర్‌కు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అడ్డుగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ముందస్తు వ్యవహారం ఆలస్యమవుతోందని సమాచారం. దీని వెనక ఉన్న అసలు కథేంటి..?

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీ కలిపిన విషయం తెలిసిందే. అప్పుడు పట్టుబట్టి మరీ ఏపీ సీఎం ఈ మండలాలను ఏపీలో కలుపుకున్నారు. ముందు ఈ ఆర్డినెన్స్‌పై సంతకం పెడితేనే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తానని చంద్రబాబు అన్నారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఆలస్యమవడానికి కారణమవుతుందట. తెలంగాణలోని ఎస్టీ నియోజకవర్గాలైన అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లో కొన్ని ప్రాంతాలు కోల్పోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ జనాభా శాతంలో స్వల్ప మార్పులు ఉంటాయని, దాన్ని తేల్చి, గిరిజన నియోజక వర్గమేనని గుర్తిస్తే సరిపోతుందని అందుకే కొంచెం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. కేంద్రం నుంచి కానీ, ఇటు ఈసీ నుంచి కానీ అడ్డులేకపోయినా.. రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న మార్పులే ముందస్తుకు అడ్డుగా మారాయని సమాచారం.

ఈ 3 నియోజకవర్గాల పరిధి మారనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. తాజా పరిధితో కేంద్రం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వివరించింది. మరోవైపు ఏపీలో విలీనమైన ఏడు మండలాలను రంపచోడవరం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని ఈసీ కూడా 2015లోనే కేంద్రానికి స్పష్టం చేసింది. ఆ నియోజకవర్గాల వల్ల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులూ రావని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై లోక్‌సభలో స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్రం గెజిట్‌ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాన్ని గుర్తించి ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల అధికారులను నియమించే ప్రక్రియ కూడా పూర్తి చేసిందని ఎన్నికల సంఘం కూడా చెబుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.