దేవదాస్ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: వైజ‌యంతీ మూవీస్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
తారాగ‌ణం: నాగార్జున అక్కినేని, నాని, అకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా, కునాల్ క‌పూర్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, న‌రేశ్‌, రావు ర‌మేశ్‌, వెన్నెల‌కిషోర్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, స‌త్య త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ద‌త్ సైనూద్దీన్‌
ఆర్ట్: సాహి సురేశ్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి
మ్యూజిక్: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌: సి.అశ్వినీద‌త్‌
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య‌

ఒక పక్క నేచురల్ స్టార్.. మరోపక్క కింగ్ నాగార్జున.. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమే ‘దేవదాస్’. తెలుగులో మొదటి తరం హీరోల తర్వాత మల్టీస్టారర్ చిత్రాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ, ఇప్పటి తరం నాయకులు మాత్రం ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లు మల్టీస్టారర్ సినిమాలపై మక్కువ చూపుతున్నారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా వచ్చిన ‘దేవదాస్’ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెరకెక్కించింది. మహానటితో ఇండస్ట్రీ హిట్ అందుకున్న నిర్మాణ సారధ్యంలో ఇద్దరు బడా హీరోలు కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుందా..?

కథ
దేవా(నాగార్జున) ఎవరికీ కనిపించకుండా చలామణి అయ్యే అండర్ వరల్డ్ డాన్. అయితే, ఒకానొక సమయంలో ఆయన గురువు, తండ్రిలాంటి వాడైన దాదా(శరత్ కుమార్‌)ను ఓ గ్యాంగ్ చంపేస్తుంది. దీంతో దాదాను చంపిన గ్యాంగ్‌ను కనుక్కోవడానికి హైదరాబాద్ వస్తాడు దేవా. ఈ క్రమంలో అతడిపై దాడి జరుగుతుంది. అప్పుడు అనుకోకుండా దేవా.. డాక్టర్ దాస్(నాని )ను కలుసుకుంటాడు. ప్రాణం విలువ తెలిసిన దాస్.. దేవాను రక్షిస్తాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. తర్వాత వీరి జీవితాల్లోకి ఇద్దరు అమ్మాయిలు ఎంటర్ అవుతారు. అప్పుడు అనుకోకుండా జరిగిన ఓ ఘటన వల్ల దేవా, దాస్ దూరమౌతారు. ఇంతకీ వీరి జీవితాల్లోకి వచ్చిన ఆ అమ్మాయిలు ఎవరు..? దేవా దాస్ ఇద్దరూ కలుసుకున్నారా..? దేవా తన గురువును చంపిన గ్యాంగ్‌ను కనుక్కున్నాడా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
‘గుండమ్మకథ’ లాంటి సినిమా అని చెప్పడం.. ట్రైలర్, టీజర్‌లో కామెడీ ఎలివేట్ చేయడంతో ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కామెడీతో పాటు బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. కాకపొతే బలమైన కథ లేకపోవడం, కథనం ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ నాగార్జున, నానిలు తమ నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రం వైవిధ్యమైన చిత్రాలు కోరుకొనే వారికి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు గాని, సగటు ప్రేక్షకుడిని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

నటీనటుల పనితీరు
ఇద్దరు బడా హీరోలు కలిసి చేసిన సినిమా కావడంతో ప్రతి ఫ్రేమ్ వారినే హైలైట్ చేయాలి. ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. సినిమాకు నాగ్, నాని ఇద్దరు చాలా ప్లస్ అయ్యారు. దేవా పాత్రలో నాగ్ లుక్స్ బాగున్నాయి. ఫ్రెష్ లుక్‌తో ఎనర్జిటిక్‌గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక దాస్ పాత్రలో నాని అదరగొట్టాడు. అమాయకపు డాక్టర్ పాత్రలో సహజ నటనతో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సినిమాని ఈ ఇద్దరూ తమ భుజాల మీద వేసుకొని నడిపించారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పూజ పాత్రలో రష్మిక, జాహ్నవి పాత్రలో ఆకాంక్ష సింగ్ గ్లామర్‌‌గా కనిపిస్తూ తమ పాత్రల పరిధి మేర నటించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కనిపించింది కాసేపైనా తన నటనతో మెప్పించాడు. సీనియర్ నరేష్, మురళి శర్మ, నవీన్ చంద్ర ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
‘శమంతకమణి’తో తో మేజిక్‌ చేసిన యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఒక మంచి సినిమాను అందించాలని ఈ కథను రాసుకున్నాడు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో తెర మీదకు తీసుకరాలేకపోయాడు. కామెడీ, ఎమోషన్స్‌ను బాగానే డీల్ చేయగలిగాడు కానీ బలమైన కంటెంట్ ఉన్న కథను రాసుకోలేకపోయాడు. టాలీవుడ్‌లో టాప్ మూవీ మేకర్స్‌గా పేరొందిన వైజయంతి మూవీస్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. సినిమాలో ప్రతి ఫ్రేమూ ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాలో భారీ అంచనాలు పెట్టుకున్నది మణిశర్మ సంగీతం మీదే. దానిని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు అనిపిస్తుంది. సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. అలాగే ఆర్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి నిరాశ పరిచాడు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో ఆయన విజయం సాధించాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది.

బలాలు
* నాగ్, నాని నటన
* నిర్మాణ విలువలు
* కొన్ని కామెడీ సీన్స్

బలహీనతలు
* రొటీన్ కథ
* నెమ్మదిగా సాగే కథనం
* ఫస్టాఫ్‌ సాగదీసినట్టుగా అనిపించడం
* హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్

మొత్తంగా: ‘దేవదాస్’లు నవ్వించే ప్రయత్నం చేశారు

రేటింగ్: 2.75/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.