సైకిల్ ఎక్కిన డేవిడ్ రాజు పట్టుతప్పాడట!

ఏపీలోని ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో గత రెండు దఫాల ఎన్నికల్లోనూ తెలుగుదేశం ఓటమిపాలవుతూ వస్తోంది. 2009లో ప్రస్తుత యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమినెదుర్కొన్నారు. అయితే 2014 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి, విజయం సాధించిన ఈయన తరువాత టీడీపీ సైకిల్ ఎక్కేశారు. 2014 ఎన్నికల్లో డేవిడ్ రాజు తెలుగుదేశం అభ్యర్థి బుడాల అజితారావుపై 19వేల ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. గతంలో డేవిడ్ రాజు సంతనూతలపాడు నుంచి టీడీపీ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించిన దాఖలాలున్నాయి. ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే యర్రగొండపాలెంలో ఇటీవలి కాలంలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాలుగున్నర ఏళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు అభివృద్ధి విషయంలో ఘోరంగా విఫలమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినా ఆయన యర్రగొండపాలేనికి నిధులు రాబట్టడంలో ఫెయిలయ్యారని స్ఠానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు డేవిడ్ రాజుపై టీడీపీ అభిమానుల్లోనూ అసంతృప్తి నెలకొందనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆయనకు యర్రగొండపాలెం టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారట. అలాగే సీఎం చంద్రబాబు చేయించిన సర్వేల్లో సైతం డేవిడ్ రాజుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట. ఈ నేఫధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు టికెట్ దక్కదనే టాక్ వినిపిస్తోంది.

దీంతో ఆయన తాను గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన సంతనూతలపాడు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని భోగట్టా. మరోవైపు ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం యర్రగొండపాలెం నియోజకవర్గం కారణంగానే తాను గతంలో ఓడిపోయానని, అందుకే అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చంద్రబాబుకు సూచించారని సమాచారం. మరోవైపు వైసీపీ ఇక్కడ సంస్థాగతంగా బలంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం సీటును వైసీపీ గెలుచుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు. ఆయన 2014లో సంతనూతలపాడు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి ఆయన యర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని భోగట్టా. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, యర్రగొండపాలెం వైసీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి టీడీపీ తరపున కొత్తగా ఎవరు పోటీచేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.