సీమ‌లో జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త‌… నిజ‌మేనా…

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు పట్టున్న రెండు జిల్లాలలో నెల్లూరు ఒకటి! గత ఎన్నికలలో పదిలో ఏడు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెల్చుకుంది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు. ముందుగా పెళ్లకూరు మండలంలో జరిగిన యాత్ర పట్ల ప్రజాస్పందన బాగానే ఉంది. మొదటి రెండు రోజులు జగన్‌ను చూడటానికి జనం ఎక్కువగానే వచ్చారు. మూడవ రోజుకే పాదయాత్రలో జనం పల్చబడ్డారు. నాయుడుపేటలో జరిగిన బహిరంగసభను సక్సెస్‌ చేయడానికి ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. ప్రస్తుతం వసాయపనులు ముమ్మరంగా సాగుతున్నాయి.. పల్లెల్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సాగునీరు పుష్కలంగా అందుతుండటంతో తెలుగుదేశంపార్టీపై సానుకూలత కనిపిస్తోంది.. ఈ కారణంగానే జగన్‌ పాదయాత్రకు స్వచ్ఛందంగా వచ్చేవారి సంఖ్య తగ్గింది. ఆ సమయానికి ఆ ప్రాంతంలో ఉన్నవారు.. జగన్‌ను చూడాలనుకునేవారు.. వైఎస్‌ అభిమానులు మాత్రం పాదయాత్రవైపు వస్తున్నారు. కడపలో జగన్‌ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కూడా ఆశించినంత జనం రాలేదట! ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుగా నేతలు వెళ్లడం.. జనాలను తీసుకొచ్చే బాధ్యతను ఆయా ప్రాంతాల ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించడం చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరులోనూ ఇదే జరుగుతోంది. నాయుడుపేట బహిరంగసభకు ప్రజలను పోగేయడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు చాలా కష్టపడ్డారట! అనంతపురం.. కడప జిల్లాల నుంచి కొంతమందిని తరలించారట! కొంతమంది మాత్రం స్వచ్ఛందంగా వస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపర్తి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు గ్రామానికి చెందిన రంగారెడ్డి ఇలాంటివారిలో ఒకరు! ప్రజాసంకల్పయాత్ర ఆరంభం నుంచి జగన్‌ వెంటే ఉన్నారు. ఆయనతో పాటు ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా నడిచారు. అర్నేనికండ్రిగ దగ్గర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గూడూరు ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే రంగారెడ్డి మరణించారని వైద్యులు తెలిపారు. అప్పటికి పాదయాత్రలో భాగంగా జగన్‌ తిమ్మసముద్రం గ్రామం వరకు వచ్చారు. అక్కడి నుంచి ఆసుపత్రి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.. జగన్‌ ఆసుపత్రికి వెళ్లలేదు.. రంగారెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తానుండే చోటుకే తీసుకురావాలని చెప్పారట! పార్టీ నేతలు అలాగే చేశారు.. ఈ సంఘటన కార్యకర్తలలో అసంతృప్తిని కలిగించింది.. కార్యకర్తలకు అండగా ఉంటానని పదేపదే చెబుతున్న జగన్‌ ఇలా చేశారేమిటీ అని మధనపడుతున్నారట! పాదయాత్రలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కూడా జనం పట్టించుకోవడం లేదట! సాగునీరుపై జగన్‌ చేస్తున్న వాదన కూడా తప్పంటున్నారు ప్రజలు.. ఈ ఏడాది సాగునీటి సరఫరా గతంలో కంటే మెరుగ్గానే ఉందనీ.. జిల్లాలో 90 శాతానికి పైగా రైతులు వరిసాగు చేస్తున్నారనీ చెబుతున్నారు. ఇక స్థానిక సమస్యలపై కూడా జగన్‌ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారట! రేషన్‌కార్డులు ఇవ్వలేదనో.. ఇల్లు మంజూరు కాలేదనో జగన్‌తో మొరపెట్టుకుంటే ఆయనిచ్చే సమాధానం… నేను సీఎం అయ్యాక రేషన్‌కార్డు ఇస్తాననడం! ఇలాంటి  జవాబులతో జనం సంతృప్తి చెందడం లేదట! అలాగే పాదయాత్ర కొనసాగే సమయంలోనే టీడీపీ నేతలను పార్టీలోకి రప్పించుకోవాలనుకున్నారు.. అది కూడా వర్క్‌ అవుట్‌ కాలేదు.. సూళ్లూరుపేట పట్టణ కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి మొదటి రోజు కనిపించారు.. ఆయన వైకాపాలో చేరారు కానీ.. ఆయన తండ్రి వేనాటి రామచంద్రారెడ్డి మాత్రం తెలుగుదేశంపార్టీని వీడలేదు.. ఇది కూడా జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తామని గట్టి హామీ ఇవ్వడంతో ఆయన రెండోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి.. చివరాఖరికి విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే! పాదయాత్రపై ఆ పార్టీ జిల్లా ముఖ్య నేతల్లో కొందరు పెదవి విరుస్తున్నారట! వేసవిలో అయితే జనం ఖాళీగా ఉంటారనీ.. అప్పుడైతే జనసమీకరణ చేయవచ్చుగానీ.. ఇప్పుడు కష్టమవుతోందని అంటున్నారట! పైగా వచ్చే కొందరు కూడా క్వాలీస్‌.. స్కార్పియోలో అయితేనే వస్తామంటున్నారట! ఉన్న డబ్బంతా ఇప్పుడే ఖర్చయిపోతే రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలి? అన్న ప్రశ్నలు కూడా వేసుకుంటున్నారట! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.