రాష్ట్రమేమైనా నీ అబ్బ‌జాగీరా కేటీఆర్‌!

తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో ఆయా పార్టీల నేత‌లు బిజీ బిజీ అవుతున్నాయి. విమ‌ర్శ‌ల ప‌ర్వంలో భాగంగా వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు ఘాటుగా స్పందించాయి. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే 15 ఏళ్ల కాలం వ‌ర‌కూ తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా కేసీఆరే ఉంటార‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వామ‌ప‌క్ష పార్టీల్లో ఒక‌టైన సీపీఎం ఘాటుగా స్పందించింది. సీపీఐ సార‌థ్యంలోని బ‌హుజ‌న్ లెఫ్ట్ ఫ్రంట్  చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్ ఈ కామెంట్‌పై మండిప‌డ్డారు.  ‘తెలంగాణకు మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉంటారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించడం సమంజసం కాదు. తెలంగాణ నీ అబ్బ జాగీరా… నీ తాత జాగీరా? 15 ఏండ్లపాటు కేసీఆర్‌ ఒక్కరే సీఎంగా ఉంటారా?.ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకూ అవకాశముండాలి`అని మండిప‌డ్డారు. 
గురువారం హైదరాబాద్‌లోని బీఎల్‌ఎఫ్‌ కార్యాలయంలో ఆ ఫ్రంట్‌ ఎన్నికల ప్రచారానికి చెందిన పాటల సీడీని తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీ 67 ఏళ్లు, టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల‌ పాలించాయని చెప్పారు. అవినీతి, కుంభకోణాలు, దుర్మార్గాలకు ఆ పార్టీలు ఒడిగట్టాయని విమర్శించారు. అవినీతి రహితంగా, నీతి నిజాయితీతో పాలన అందించేందుకు బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఈ ఫ్రంట్‌ను గెలిపిస్తే ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుడతామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఓట్లున్న వారే పాలించాలని, అందుకే 52 శాతం ఓట్లున్న బీసీలకే సీఎం పదవి ఇస్తున్నామని చెప్పారు. కొల్లాపూర్‌లో 500 ఓట్లు లేని వ్యక్తి కాంగ్రెస్‌ నుంచి, టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి పదవి పొందారని వివరించారు. బ్యాంకులను దోచుకున్నారని విమర్శించారు. మహాకూటమి ప్రజావ్యతిరేకమని ఎద్దేవా చేశారు. అందులో సీపీఐ ఉండడం దురదృష్టకరమని ఆయ‌న వ్యాఖ్యానించారు. రూ.2 వేల నోట్లు ప్రజల వద్ద, బ్యాంకుల్లో లేవని, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుల వద్దే ఉన్నాయని చెప్పారు. విద్యావైద్యం ప్రభుత్వ రంగంలోనే అమలు చేస్తామని చెప్పారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించారు. మద్యం నిషేధం అమలు చేస్తామన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, నూతన ఒరవడిని సృష్టించాలని బీఎల్‌ఎఫ్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. డబ్బులు పంచితే గెలుస్తామని బీజేపీ నేత పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యాలను ఖండించారు.
తెలంగాణకు కొత్త దారి చూపుతామనీ, ప్రత్యామ్నాయ విధానాలతో అభివృద్ధి చేస్తామనీ బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీసీని సీఎంగా ప్రకటించాలని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేశారని అన్నారు. బీఎల్‌ఎఫ్‌ నినాదం ప్రభావం చూపడమే ఇందుకు కారణమని చెప్పారు. బీసీ, ఎస్సీ సీఎం అయితే సమస్యలు పరిష్కారమవుతాయా?అన్న ప్రశ్నలు వస్తున్నాయనీ, ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకూ అవకాశముండాలనీ చెప్పారు. ఇది చారిత్రక అవసరమనీ అన్నారు. సామాజిక న్యాయమంటే సామాజికంగా సహాయం చేయడం కాదనీ, అట్టడుగుకులాలు సాధికారత సాధించాలనీ చెప్పారు. ఆ కులంలో అందరూ సామాజికంగా హోదా పొందాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్నది కాదని, ప్రభుత్వాన్ని నిర్ణయించబోతున్నామని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.