‘‘కల్లుముంత దొరికింది.. కోడిముక్క లేకుంది’’

రాజకీయ నాయకులనుంచి కూసింత్ హాఫ్ బీట్ సరదాగా కనిపించే వార్తలు కావాలనుకుంటే గనుక.. సీపీఐ నారాయణ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో వెతుక్కుంటే చాలు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో.. అనే ఆలోచన కూడా లేకుండా.. తనకు ఎలా తోస్తే అలా మాట్లాడే కొద్ది మంది నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఉపరాష్ట్రపతి, సీఎం మీద ఎడాపెడా సెటైర్లు వేసేసి.. తామంతా స్టూడెంట్ ఏజ్ నుంచి స్నేహితులమే.. తమ మధ్య పరాచికాలు మామూలే అని సెలవిచ్చినా.. గాంధీ జయంతి రోజు కూడి కూర తినేసి.. కోడి అంటే నాకిష్టం.. కోడి కూర కనిపిస్తే కంట్రోల్ లో ఉండలేను అని కుండబద్దలు కొట్టినా.. నారాయణకు మాత్రమూ చెల్లుతుంది. అలాంటి నారాయణ గురువారం నాడు మరో సరదా విషయానికి కారణం అయ్యారు. కల్లు ముంత కనిపించేసరికి ఠకాల్న ఆగిపోయి.. దాన్ని కాస్తా ఓ పట్టు పట్టారు. ఈ కల్లు ప్రియత్వం ఎపిసోడ్ మొత్తం వెలగపూడి సచివాలయానికి అతి సమీపంలోనే చోటు చేసుకోవడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. సీపీఐ నాయకుడు నారాయణ మరో ఇద్దరు మిత్రులతో కలిసి సైకిలు తొక్కుకుంటూ గురువారం ఉదయాన్నే వెలగపూడి సచివాలయం వద్దకు వచ్చారు. తీరా గేటు దాకా వచ్చిన తర్వాత అక్కడి సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఈ సమయంలో సెక్రటేరియేట్ లో ఎవరూ ఉండరని అంటూ.. ఆయనను గేటు వద్దనే ఆపేశారు. ఏదో సరదాగా సచివాలయం చూడ్డానికి వచ్చా అంటూ ఆయన కాసేపు మెయిన్ గేటుకు వెలుపలే అక్కడున్న ఖాళీ రోడ్లపై సైకిలుపై కాస్త చక్కర్లు కొట్టి.. తిరుగు ప్రయాణం అయ్యారు. కాస్త దూరం వెళ్లేసరికి రోడ్డు పక్కన కల్లు అమ్మకం కనిపించింది. ఆయన సైకిలుకు బ్రేకులు పడ్డాయి. కాళ్లు అటువైపు లాగాయి. ఎంచక్కా కల్లు పాకలోకి వెళ్లి ఓ పట్టు పట్టారు.

ఈ వ్యవహారం అంతా ఉదయాన్నే జరిగింది గనుక.. నారాయణ కు కల్లులోకి మంచింగ్ కు ఏమీ దొరికినట్లు లేదు. అదే సాయంత్రం వేళ.. ఏ కల్లు పాక వద్దకో వెళ్లి ఉంటేనా.. ఎంచక్కా చీకులో.. కోడికూరో.. ఆయనకు పసందుగా దక్కి ఉండేదని పలువురు జోకులేసుకుంటున్నారు. మొత్తానికి ఇదివరకు కోడికూర ప్రియత్వం గురించి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన నారాయణ, ఇవాళ కల్లు ముంత మీది ప్రేమతో మరోసారి వార్తల్లోకి వచ్చారు.

1 Comment

  1. mari eenameeda drunk and drive case pedathara, rajakeeya nayakudani vadilesthara. chudali. secretariat munde thagi vahanam nadipadante yentha dhairyam vundali. law ante bhayameleda.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.