టీడీపీతో పొత్తుపై యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్

గత సంవత్సరం మొత్తానికి రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా నిలిచిన అంశాల్లో కాంగ్రెస్-తెలుగుదేశం పొత్తు ఒకటి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అనగానే మిగిలిన పార్టీలతో పాటు ప్రజలు కూడా షాక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ.. అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడమేంటని చాలా మంది ప్రశ్నలు గుప్పించారు. మిగిలిన పార్టీలు సైతం దీనిని క్యాష్ చేసుకోవాలని చూశాయి. ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి ఇది కూడా ఓ కారణం అయింది. ఈ పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సక్సెస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ భాగస్వామ్యంలోని ప్రజాకూటమికి కేవలం 21 సీట్లే వచ్చాయి. దీంతో ఈ పార్టీల మధ్య స్నేహ సంబంధం దెబ్బతింటుందేమోనని అంతా అనుకున్నారు. కానీ, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు అవసరం ఉండడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. టీడీపీని దూరం చేసుకునే ప్రయత్నం చేసుకోవడంలేదు. ఇటీవల వీళ్లిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు జాతీయ స్థాయి కూటమి గురించి మాట్లాడారు.

అయితే, ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు గురించి ఎటువంటి చర్చలు జరగలేదని ఆయా పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఏపీలో కొద్దిరోజుల్లో జరిగే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవనే అంచనాకు చాలా మంది వచ్చేశారు. దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణలో కలిసి పోటీ చేసినా.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నా.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్‌ వేర్వేరుగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ గురువారం 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇతర రాష్ర్టాల పరిస్థితి ఎలా ఉన్నా… ఆంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉందని రాష్ట్ర నేతలు చెప్పారట. అంతేకాదు, తెలంగాణలో వెలువడిన ఫలితాల తర్వాత పొత్తు విషయంలో ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపించిందని తెలిసింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభిప్రాయ సేకరణలో అత్యధికులు టీడీపీతో పొత్తు వద్దని అన్నారని, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని రాహుల్‌ గాంధీకి వివరించారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.