టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చా.? లేదా..?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ.. రాజకీయ పార్టీలు పలు విన్యాసాలు చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వచ్చే ఎన్నికలు ఆసక్తికరంగా సాగనున్నాయి. అన్ని పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని చెప్పవచ్చు. భారతదేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు ఏపీలో బలంగా ఉండేది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఏపీలో అయితే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా..? లేదా..? అనే అనుమానం కలిగేలా ఉంది ఆ పార్టీ పరిస్థితి. తెలంగాణలో మాత్రం కొంత బాగానే ఉన్నా ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది.

ఇటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ సారి ఎలాగైనా అక్కడ ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా, పలు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. అంతేకాదు, కేంద్రంలో విపక్షాలతో జట్టు కట్టాలని భావిస్తున్న ఆ పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కొద్దిరోజులుగా సఖ్యతగా ఉంటున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక సర్వే చేయించబోతుందట. పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర సంస్థతో సర్వే నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మీరు సమర్ధిస్తారా..? వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు..? కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై మీ స్పందన ఏమిటి..? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఎవరికి క్రెడిట్ ఇస్తారు..? వంటి ప్రశ్నలతో ఆ సర్వే ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా టీడీపీతో పొత్తుపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు కొన్ని పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తుపైనే ఎక్కువ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తు ఖరారు కాకముందే టీడీపీకి నియోజకవర్గాలను కేటాయించాలన్నదానిపై టీపీసీసీ అధ్యయనం జరుపుతున్నట్లు తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.