వైసీపీకి దెబ్బ వేసేందుకు కాంగ్రెస్ చేసిన ప్లాన్లు ఇవే..!

ఆ రెండు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే.. అందులో ఒక పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తుండగా.. మరొక పార్టీనేమో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపగలిగితే చాలని అనుకుంటోంది. అవే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌గా చెప్పుకునే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దింపి.. సీఎం కుర్చీ ఎక్కాలని భావిస్తున్నాడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. అందుకోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విభజన కారణంగా ఏపీలో నామరూపాలు లేకుండా పోయిన ఆ పార్టీ.. ఈ ఎన్నికల ద్వారా ఏపీలో మరోసారి ఊపిరిపోసుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే ఏపీలో బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందుకోసం విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలతో పాటు, ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకురాగలిగారు. అలాగే మరికొందరు నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారట.

వాస్తవానికి కిరణ్ వచ్చిన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఏపీలో బలపడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించడం.. ఇటీవల బీజేపీకి దగ్గరవడం వంటి కారణాలతోనే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆ పార్టీ నాయకులు వైసీపీని దెబ్బేసేందుకు అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేస్తుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందని సమాచారం. అయితే, అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్ధులను నిలబెట్టకున్నా.. వైసీపీ బలంగా ఉన్న చోట మాత్రం ప్రభావం చూపగలిగే నాయకులను దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అలాగే పార్టీలోని ముఖ్య నాయకులను పార్లమెంట్‌కు పోటీ చేయించాలని కూడా అనుకుంటున్నారట. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కిరణ్‌దే. ఆయనను వైసీపీ సిట్టింగ్ స్థానమైన కడప జిల్లాలోని రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయించనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలో ఇక్కడ టీడీపీ-బీజేపీ అభ్యర్ధి పురందేశ్వరిపై వైసీపీ అభ్యర్ధి మిధున్ రెడ్డి విజయం సాధించారు. మరి కాంగ్రెస్ ప్లాన్ల నుంచి జగన్ ఎలా బయటపడతాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.