అయితే కాంగ్రెస్…లేదంటే కమ్యూనిస్ట్‌

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోగల మిర్యాలగూడ నియోజకవర్గం రసవత్తర రాజకీయాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలకు పట్టం కడుతూవస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కార్మికులు, కర్షకులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం పార్టీ అభ్యర్థులకు మద్దతుపలుకుతున్నారు. అయితే రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి బరిలోకి దిగినప్పటికీ పరాజయం పాలయ్యారు. మిర్యాలగూడ సెగ్మెంట్ 1952లో పెద్దమునగాల నియోజకవర్గం పేరుతో ఉండేది. 1957లో మిర్యాలగూడ నియోజకవర్గంగా అవతరించింది. 1952 నుండి 2014 వరకు మొత్తం 14సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగ్గా ఎనిమిది సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఎం, రెండుసార్లు పీడిఎఫ్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పన చిన కృష్ణారెడ్డి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఖ్యాతి గడించారు. అతని కుమారుడు తిప్పన విజయసింహారెడ్డి సైతం ఇదే నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి కూడా మూడుసార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఐ గెలిచిన ఏకైక స్థానంగా మిర్యాలగూడ పేరొందింది.

దీంతో జూలకంటి సీపీఐ శాసనసభ పక్ష నేతగా పనిచేయగలిగారు. ఈ నియోజకవర్గం 1952లో పెద్ద మునగాల పేరిట ద్విసభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి వెంకటరామారావు గెలిచారు. మిర్యాలగూడ నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత 1957లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున పోటీచేసిన సీ.వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎన్.రెడ్డిపై విజయం సాధించారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి తిప్పన చిన కృష్ణారెడ్డి సీపీఐ తరపున పోటీచేసి చల్లా సీతారాంరెడ్డిపై గెలుపొందారు. 1967లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా సీతారాంరెడ్డిపై తిప్పన చిన కృష్ణారెడ్డి రెండోసారి విజయం దక్కించుకున్నారు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మూడోసారి పోటీ చేసిన తిప్పన చిన కృష్ణారెడ్డి సీపీఎం అభ్యర్థి ఎం.ఎస్.రామయ్యపై గెలిచి హ్యాట్రిక్ విజయం దక్కించుకున్నారు. 1978లో సీపీఎం అభ్యర్థి ఎ.లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ఐ తరపున పోటీచేసినటి.లింగయ్యపై విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్‌ఐ నుంచి పోటీచేసిన చకిలం శ్రీనివాస్‌రావు సీపీఎం అభ్యర్థి ఎ లక్ష్మీనారాయణపైన విజయం సాధించారు.1985లో సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎ. లక్ష్మీనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి జి.చలినమ్మను మట్టికరిపించారు. 1989లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి తిప్పన విజయసింహారెడ్డి సీపీఎం అభ్యర్థి ఎ.లక్ష్మీనారాయణరెడ్డిపై పైచేయి సాధించారు.

1994లో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి టి.విజయసింహారెడ్డిని ఓడించారు. 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రేపాల శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి అరుణ సుందరిపైన గెలిచారు. 2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి టీడీపీ అభ్యర్థి పి.చంద్రశేఖర్‌రెడ్డిపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీచేసిన జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తిరునగరి గంగాధర్‌ను ఓడించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నల్లమోతు భాస్కర్‌రావు టీఆర్‌ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. దీంతో సీపీఎం అభ్యర్థి సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో నల్లమోతు భాస్కర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరారు. అలుగుబెల్లి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. రాబోయే ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భాస్కర్‌రావు పోటీ చేస్తుండగా, సీపీఎం నుండి జూలకంటి రంగారెడ్డి మరోసారి బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. మరి ఈ సారి మిర్యాలగూడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.