టీడీపీలోకి రావాలనుకుంటున్న నేతకు కాంగ్రెస్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తుంటే. అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం అభివృద్ధే ప్రధాన ఆయుధంగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ముఖ్యమైనవి. ఆయన వయసు పైబడుతున్న సమయాన మరోసారి సీఎం సీటులో కూర్చోవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచినా కొన్ని పొరపాట్లు జరిగాయని భావించిన ఆయన ఈ సారి వాటిని రిపీట్ చేయకూడదని అనుకుంటున్నారట. అందుకోసం, టీడీపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా, గత ఎన్నికల్లో ఓడిపోయిన చోట ఈ సారి మంచి అభ్యర్ధులను నిలబెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారని, అవసరమైతే వేరే పార్టీలోని నేతలను టీడీపీలోకి ఆహ్వానించాలని, అలాగే టీడీపీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్న నేతలను అస్సలు వదులుకోకూడదని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా రాయలసీమకు చెందిన కీలక నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని, ఆయన కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆయన చంద్రబాబు నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సైకిల్ ఎక్కుతారని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఏపీ రాజకీయాల్లో ఓ వార్త కలకలం రేపుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ.. బైరెడ్డితో రహస్య మంతనాలు జరిపారన్నదే ఆ వార్త సారాంశం. కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రాజ్యసభ సభ్యత్వం ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులను బైరెడ్డి కలిశారని ప్రచారం సాగుతోంది. ఆయనతో భేటీ తర్వాత.. ప్రధాని మోదీ గ్రాఫ్‌ క్రమక్రమంగా తగ్గుతోందని, దేశంలో కాంగ్రెస్‌ బలపడుతోందని, రాహుల్‌ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని సన్నిహితుల వద్ద బైరెడ్డి అన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఆయన కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో.. వచ్చే ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.