కాంగ్రెస్ మేనిఫెస్టో.. టీఆర్ఎస్‌కు ఇబ్బందేనా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉండబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభివృద్ధే అజెండాగా ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. విభజన వల్ల రాష్ట్రంలో జెండా ఎగురవేయొచ్చు అనుకున్న కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో అక్కడి ఓటర్లు మొండిచేయి చూపించారు. దీంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా ఉండడంతో పాటు, గెలుపు గుర్రాలను ఎంపిక చేసి విజయం సాధించాలని భావిస్తోంది. అందుకోసం ఎప్పటి నుంచో కసరత్తు ప్రారంభించిన ఆ పార్టీ.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కొంచెం స్పీడు పెంచేసింది. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడంతో పాటు ఇప్పటి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ నేతలో పలు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం.. ర్యాలీలు నిర్వహించడం సహా తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది.

ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’కు ప్రతికూల ఫలితం రావడంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. దీంతో ఆ పార్టీ అధిష్టానం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతోంది. అలాగే ఈ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం ప్రభుత్వ వైఫల్యాలనే నమ్ముకుంటే గెలవడం అసాధ్యమని గ్రహించిన ఆ పార్టీ.. ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టోను సిద్ధం చేసింది. సీనియర్ నేత జీవన్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఆరు నెలలుగా కసరత్తు చేసి తయారు చేసిన మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో మధ్య తరగతి వారిపై వరాల జల్లు కురిపించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇల్లు నిర్మాణం, ఇల్లు లేని వారికి డబ్బు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పెళ్లి కానుకల పునరుద్ధరణ, కొన్ని సామాజిక వర్గాలకు పరిమిత ఉచిత విద్యుత్ తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందు పరిచారు. ఈ మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉందని, అనవసర హామీలు లేకుండా నమ్మశక్యంగా రూపొందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం బలం పుంజుకోవడంతో ఇబ్బంది పడుతున్న టీఆర్ఎస్‌కు.. కాంగ్రెస్ మేనిఫెస్టో మరింత ఇరుకున పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
* ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇల్లు
* ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు
* తెల్ల రేషన్ కార్డు ఉన్న ఇంటికి 7 కిలోల సన్న బియ్యం
* కల్యాణ లక్ష్మీ సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
* ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
* అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు
* వికలాంగశాఖ విలీనం రద్దు
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా రూ.2 లక్షలు
* డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షలు
* దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.