సైకిల్ ‘లిఫ్ట్’ తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలు?

ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైన సంగతి విదితమే. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పలు ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు తిరిగిఊపిరి పోయాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి – బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి మాజీ కాంగ్రెస్ నేతలను సొంతగూటికి తీసువచ్చారు. పాతవారిని సొంతగూటికి తెచ్చుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టింది. అయితే అందుకు భిన్నంగా మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. కొత్త నేతలు పార్టీలో చేరడం సంగతి దేవుడెరుగుగానీ, ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్నసీనియర్ నేతలు కూడా దుకాణం సర్దేయడానికి ప్లాన్ చేస్తుండడంతో కిం కర్తవ్యం అంటూ కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోందని సమాచారం. 2019లో పోటీ చేయడం ద్వారా మళ్లీ ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా కనీసం 2024లోనైనా పుంజుకోవాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
ఇటువంటి సమయంలో పార్టీకి మద్దతుగా ఉండాల్సిన మాజీలు ఏమాత్రం రాజీ పడకుండా వేరే పార్టీల్లోకి జంప్ అవడానికి సిద్ధమవడం హైకమాండ్ ను కలవరపెడుతోందని తెలుస్తోంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత శైలజా నాథ్ సైకిలెక్కేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబును కలిశారని సమాచారం. అయితే తమది రాజకీయ భేటీ కాదని ఆయన తేల్చి చెప్పడం విశేషం. అలాగే మరో కాంగ్రెస్ నేత కొండ్రు మురళి కూడా చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. రాజాం నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారట. కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత కిల్లి కృపారాణి కూడా పార్టీని వీడడం ఖాయమని భోగట్టా. అయితే శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఉండడంతో ఆమెకు టీడీపీలోకి ఎంట్రీ కష్టంగా ఉందని అంటున్నారు. దీంతో ఆమె వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం. శ్రీకాకుళం వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నుంచి తిలక్ ఇప్పటికీ అక్కడి సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూడటంలో అధిష్టానం విఫలమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.