పొత్తుపొడవక ముందే వద్దంటున్న కాంగ్రెస్ నేతలు

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో నిరసన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును నమ్మవద్దని, ఆ పార్టీతో పొత్తు వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు వాదిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై వారు ఇప్పటికే ఢిల్లీకి నివేదికలు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ పార్టీకే నష్టం అని వారు బల్లగుద్దిమరీ చెబుతున్నారట. అటు తెలంగాణలోనైనా, ఇటు ఏపీలోనూ.. కాంగ్రెస్ కు ఆ పార్టీతో పొత్తు వల్ల నష్టమే కానీ, అణువంతైనా లాభం ఉండదని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు బహిరంగంగానే అంటున్నారట. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, సొంతంగా పోరాడితే ఇప్పటికిప్పుడు కాకపోయినా,  భవిష్యత్ లో అయినా కోలుకుంటామంటున్నారట. అదే చంద్రబాబుతో చేతులు కలిపితే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి నివేదికలు పంపినట్టు భోగట్టా. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కూడా తెలుగుదేశంతో పొత్తుపై కొంత అసహనం కనిపిస్తోంది. ఈ విషయంలో కొంతమంది నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తు వద్దంటున్నారు.
అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పొత్తు వల్ల తాము నిలదొక్కుకుంటామని ఆశపడుతున్నారట. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేస్తూ ప్రకటన కూడా చేసింది. పొత్తులపై తమకు క్లారిటీ ఉందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించి కాంగ్రెస్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొత్తులపై వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదన్న రఘువీరా తాజాగా అసెంబ్లీ నియోజకవర్గ నేతల సమవేశంలో ఎన్నికల ప్రణాళికపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీనిని చూస్తుంటే 2019 ఎన్నికలకు కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ నేతల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పీసీసీ చీఫ్ పార్టీ నేతలకు గట్టిగా చెప్పారట. అలాగే పార్టీ నవంబర్ 19 నాటికి 44 వేల బూత్ కమిటీలు వేసి త్వరలోనే ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, కర్నూలులో రాహుల్ గాంధీ పర్యటనే దీనికి నాంది అనే విధంగా కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.