
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ- కాంగ్రెస్ ల మధ్య రసవత్తర రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఇటీవల చంద్రబాబు కాంగ్రెస్ ను మెచ్చుకుంటూ పొత్తుకు తెరలేపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ కు కూడా టీడీపీతో పొత్తుకు మంతనాలు సాగిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నా, వారు ఇప్పటివరకూ బయటపడినట్టు ఎక్కడా కనిపించలేదు. పైగా వారు టీడీపీతో పొత్తు కుదురుతుందనే ఆశతో తమ వ్యూహాలను రూపొందించుకున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువజన కాంగ్రెస్ బస్సుయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించింది. పనిలో పనిగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో అవసరమైతే ఆమరణ దీక్షలకు దిగుతామనికూడా చెప్పారు. అయితే అది ఎంతవరకూ కార్యరూపం దాల్చిందో ఇంతవరకూ వెల్లడికాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారధ్యంలో ఈ బస్సుయాత్ర అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారని గతంలో ప్రకటించారు. అయితే పొత్తుల విషయం తేలాకా దీనిని నిర్వహిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీ జిల్లాలోను రెండు రోజుల పాటు ర్యాలీలు, రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ చేసిన మోసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఈ విషయంలోనే వారు వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను యువజన కాంగ్రెస్ పార్టీ 21 జిల్లాలుగా మార్పుచేసుకుని ఈ ప్రచారం సాగించనున్నదని తెలుస్తోంది. అదే విధంగా రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 42 వేల బూత్ కమిటీలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిది.
అయితే దీని గురించి తాజా సమాచారమేదీ బయటకు రాకపోవడం విశేషం. రాహుల్ సారధ్యంలో బస్సు యాత్రను ముగించాక యువజన కాంగ్రెస్ జలదీక్షలు, కలెక్టరేట్ల వద్ద రిలే దీక్షలు తదితర ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని సమాచారం. అలాగే ప్రజలను తిరిగి తమ వైపు మరల్చుకునేందుకు వాడవాడలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వీధికూడలి ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు గతంలోనే నిర్ణయించారు. పనిలో పనిగా రాష్ట్ర విభజన పాపం తమ ఒక్కరిదే కాదని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినందునే ఇది జరిగిందనికూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారట. అయితే ఇన్ని ప్రకటనలు చేసినప్పటికీ కాంగ్రెస్ వీటిని కార్యాచరణలోకి తీసుకువచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నదని పలువులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల వ్యూహాలేమిటో త్వరలోనే తేలిపోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Be the first to comment