బీసీలకు కాంగ్రెస్‌ గాలం

తెలంగాణ అంతటా ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికలల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలల్లో గెలుపు గుర్రాల కోసం పార్టీల కసరత్తు మొదలైంది. ఇటు తెలంగాణ శాసనసభను రద్ధు చేసిన వెంటనే గులాబీ దళపతి కేసీఆర్‌ అభ్యర్థుల లిస్టును ప్రకటించడంతో రాజకీయ పార్టీలల్లో అలజడి చెలరేగింది. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు షాక్‌ తిన్నాయి. కేసీఆర్‌ ప్రకటించిన సీట్లలో బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని బీసీలు ఆగ్రహం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టీఆర్‌ఎస్‌లో సీట్లు దక్కని నేతలు అసమ్మతి రాగాన్ని అందుకున్నారు. టీఆర్‌ఎస్‌ మినహా మరే పార్టీ ముందస్తు ఎన్నికలను ఎదుర్కునేందుకు సన్నద్ధం కాని పరిస్థితి తెలంగాణలో ఉంది. దీంతో ఇదే అదనుగా భావించిన కేసీఆర్‌  పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతన్నారు. కేసీఆర్‌ను ఢీ కొనేందుకు కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌ వేసింది. 36 ఏళ్ల చరిత్రలో తొలిసారి టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధపడింది. టీఆర్‌ఎస్‌కు ధీటుగా  కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐలతో మహా కూటమిని ఏర్పాటు చేసింది. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన స్థానాలలో అసమ్మతి వాదులను ఆకర్షించేలా ఒక వైపు ప్రయత్నిస్తూనే మరో వైపు బీసీలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. జనాభా ప్రకారం బీసీలకు 66 స్థానాలు ఇస్తామని ఇదివరకు బహుజన లెఫ్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే  బీజేపీ సైతం బీసీల జపం మొదలుపెట్టింది. తెలంగాణలోని 56శాతం గల బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్‌ మహా కూటమి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 
తెలంగాణలో బలమైన సామాజిక వర్గాలను సమీకరించుకునే పనిలో టీఆర్‌ఎస్‌ ఉండగా, ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై దృష్టి సారించిన కాంగ్రెస్‌..బడుగు సామాజిక వర్గాల నేతలను సైతం తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మజ్లిస్‌, బీజేపీ మినహా మిగిలిన పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి..టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చేప్పేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అలాగే  రాష్ట్ర కాంగ్రెస్‌లో గుజరాత్‌ ఫార్మూలాను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సామాజిక వర్గాల సమీకరణకు సన్నహాలు చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ రాష్ట్ర నేతలతో ప్రమేయం లేకుండా నేరుగా రంగంలోకి దిగి తన దూతల ద్వారా తెలంగాణలోని కీలక నేతలతో చర్ఛలు జరుపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా బలమైన బీసీ నేతగా పేరుగాంచిన ఆర్‌.కృష్ణయ్యను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ నేతలతో సంబంధం లేకుండా రాహుల్‌ గాంధీ దూతలు నేరుగా కృష్ణయ్యతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. 46 ఏళ్ల సుదీర్ఘకాలంలో పదివేలకు పైగా బీసీ ఉద్యమాలను నడిపిన చరిత్ర గల బీసీ ఉద్యమ నేతగా పేరున్న కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా టీపీసీసీలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీఠ వేస్తున్నారనే అపవాదును చెరిపేసుకుని సమతుల్యం సాధించే దిశాగా యత్నిస్తోంది.
1982లో ఎన్టీఆర్‌, అదే విధంగా విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ లాంటి కీలక నేతలు ఆర్‌.కృష్ణయ్యకు పదవులు ఇస్తామని టికెట్‌ ఇస్తామని పార్టీలోకి ఆహ్వానించినా.. ఆయన వెళ్లకుండా బీసీ ఉద్యమాలకే పరిమితమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీడీపీ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన టీడీపీలో చేరి, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మెజార్టీ సీట్లు సాధించకపోవడంతో ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. కానీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కృష్ణయ్య ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వలేదు సరికదా..పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలను సైతం ఇవ్వలేదు. దీంతో  ఏమాత్రం నిరాశ చెందని కృష్ణయ్య తన ఉద్యమ ఎజెండాను కొనసాగిస్తూనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 అభ్యర్థుల లిస్టులో బీసీలకు అన్యాయం జరిగిందని కృష్ణయ్య విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. బీసీలను విస్మరించే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణయ్య హెచ్చరించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే ఆయన చేరికపై స్పష్టత రానుందనేది ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు భోగట్టా!  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.