వ్యూహాన్ని అలా మార్చుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుని యువతరాన్ని ఆకర్షించే పనిలో పడింది. పార్టీ పదవులు యువతకే కట్టబెట్టాలని నిర్ణయించుకుందని సమాచారం. గతంలో కాంగ్రెస్‌లో యూత్‌కు పెద్దగా స్థానం ఉండేది కాదు. పార్టీలోని పెద్దవారి మాటే చెల్లుబాటు అయ్యేది. యువత పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నా, అనుభవం లేదన్న సాకుతో పదవులను ఇచ్చేవారు కాదు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లంతా పార్టీని వదిలిపెట్టిన విషయం విదితమే. ఉన్న అరకొర నేతలు ఇంటిపట్టునే ఉంటున్నారని తెలుస్తోంది ఇలాంటి సమయంలో పార్టీకి జవసత్వాలు కలిగించాలంటే యువతను ఆకట్టుకోవడమే మార్గమని కాంగ్రెస్‌ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ పదవులలో వారికి కూడా సముచితస్థానం కల్పించాలని యోచిస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవులను యువతకే కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ పనిలోనే అధినాయకత్వం ఉందని తెలుస్తోంది. కీలకమైన పదవులను కూడా యువతరానికి ఇవ్వాలనే సంకల్పంతో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన నేత కావడంతో మొదట అక్కడి నుంచే సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని సమాచారం.
యువజన కాంగ్రెస్‌ లో  ఎలాగూ యువతకే పెద్దపీట వేయాల్సి ఉంటుంది. అదే విధంగా  మహిళా సంఘాలు.. పార్టీ అనుబంధ సంఘాలలో కూడా  యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా యువకులనే నియమించారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు యువత ఎక్కువగా వస్తోందని తెలుస్తోంది అరవైఏళ్లు దాటినవారు పార్టీలో పదుల సంఖ్యలోనే ఉన్నారన్న విషయాన్ని రఘువీరారెడ్డే స్వయంగా గతంలో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కూడా యువతకే ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ చీఫ్‌ అన్నట్లు భోగట్టా. తాజాగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగాయనే సమాచారం అందుతోంది. కాంగ్రెస్‌లో చేరుతున్న యువతకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్‌ రాజీవ్‌రెడ్డిని నియమించిన విషయం విదితమే. అలాగే తాడిపత్రి, హిందూపురం, కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం, కల్యాణదుర్గం, మడకశిర, ధర్మవరం, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాలలో కూడా యువతకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో కాంగ్రెస్‌ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.