ఊపిరి కోసం ప్రచారం… ఊరూవాడా సంచారం

విభజన కారణంగా తీవ్ర ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు పార్టీకి తిరిగి ఊపిరిపోసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో ఇక కాంగ్రెస్ పని అయిపోయందన్న భావన ఏర్పడిన తరుణంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ బలపడేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవలే ఆపరేషన్ స్వగృహను ప్రారంభించిన నేతలు ఆయా జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, పార్టీ మళ్లీ ప్రాణం పోసుకోనుందన్న నమ్మకాన్ని కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రజలను తిరిగి తమ వైపు మరల్చుకునేందుకు వాడవాడలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వీధికూడలి ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు, అలాగే అభిమానుల ఇళ్ల వద్ద పార్టీ గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టే పథకాలను ప్రచారం చేయడానికి సూచికగా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
పనిలో పనిగా రాష్ట్ర విభజన పాపం తమ ఒక్కరిదే కాదని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినందునే ఇది జరిగిందని కూడా ప్రజలకు వివరించనున్నారు. అయితే విభజనలో జరిగిన అన్యాయాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూరించగలదని ఆ బోర్డుల్లో రాయనున్నారు. అలాగే కరపత్రాల పంపిణీ, వీలైన చోట్ల కార్యకర్తల ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఈ మేరకు వీలైనంత త్వరలో అన్ని చోట్లా పార్టీ ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదిలావుండగా మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో గెలుపు గుర్రాల వేట మొదలైంది. మూడు నెలల ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసింది. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి  పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తమకు అనుకూలురైన నాయకులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది అలాగే నేతలు ఎవరికి వారుగా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై ప్రయత్నాలు ప్రారంభించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.