పవన్ అధైర్య పడుతున్నాడా..? ఇంకా టైముందిగా..!

జనసేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తానంటూ ప్రజల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. రాజకీయంగా వేస్తున్న అడుగులు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఆయన అధైర్య పడుతున్నాడో లేక తన సినిమాల్లో నిర్ణయాలు తీసుకున్నట్లే తీరికగా నిర్ణయం తీసుకొని ముందుకెళదాం అనుకుంటున్నాడో అర్థం కాకుండా ఉంది ఆయన తీరు. జనసేనానిగా జనం ముందుకొచ్చిన ఆయన నాన్చుడు ధోరణి జనంలో ఆయనపై వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇలాగైతే పవన్.. రాజకీయ ప్రయాణం సక్సెస్ కావటం కష్టమే! అనే చర్చలకు దారి తీస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోకడ. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బలం చూసి పవన్ ఆలోచనలో పడ్డారా? ఏంటి? అని కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు చెప్పుకోవటం కనిపిస్తోంది.  

ఇటీవల తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయని పవన్.. అందుకు కారణం ముందస్తు ఎన్నికలే అని చెప్పి తప్పించుకున్నారు. ఊహించని విధంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారని, సరైన సమయం లేకనే జనసేన ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని చెప్పిన పవన్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని అన్న స్థానాల నుంచి జనసేన బరిలో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన సమయం చాలా దగ్గరకొచ్చింది. మరో రెండు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ఇతర పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఎన్నికల బరిలో దిగేందుకు ప్లాన్స్ చేస్తున్నాయి.

కానీ జననసేనని మాత్రం ఇప్పుడు కూడా ఎలాంటి హంగామా లేకుండా తీరికగా కూర్చోవటం చూసి ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకనే ఇలా ఉంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. పవన్ మాట ప్రకారం ఈ మొత్తం స్థానాల్లో జనసేన పోటీ చేయాలి. ఆయన మాట ప్రకారమే కావాల్సినంత సమయం కూడా ఉంది. కానీ పవన్ మాత్రం ఇప్పటివరకు సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం, మెదక్, నల్గొండ భువనగిరి.. ఈ స్థానాలకే కమిటీలను ప్రకటించారు. మరి కొద్దిరోజుల్లో అదనంగా మరో ఒకటో.. రెండో  కొత్త కమిటీలు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే ఈ ఎన్నికల్లో జనసేన కేవలం 7 లేదా 8 స్థానాల్లో మాత్రమే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో కావాల్సినంత సమయం దొరికినా పవన్.. ముందుకు రావటం లేదంటే ఆయనలోని అధైర్యానికి అది నిదర్శనం అనే టాక్ మొదలైంది జనాల్లో. ఇలాగైతే ఎలా? అని తన సొంత పార్టీ నేతలు సైతం చెప్పుకుంటున్నారని సమాచారం.       

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.