తీవ్ర చర్చకు దారితీస్తున్న సీఎం ప్రసంగం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల సాధన కోసం తెలుగుదేశం పార్టీ కర్నూలులో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి ప్రసంగం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు గుర్తుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని, ఇటీవల అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ నేతగా హామీలను అమలు చేయాల్సిందేనన్న డిమాండ్ వీడియోలను వేదికపై ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా హామీ అమలు చేసి తీరుతామని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హామీ ఇస్తున్నారని గుర్తుచేయడం సంచలనంగా మారింది. విభజనను సహేతుక పద్దతుల్లో చేయకుండా చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగిందని, దీనికి కారణం తెలుగోడి సత్తా ఏంటో వారు తెలుసుకోవడమేనని బాబు ప్రకటించడం విచిత్రమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కూడా తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో బీజేపీ, వైకాపా, జనసేనకు రుచి చూపాలని అంటూ కాంగ్రెస్ ను వెనకేసుకు రావడంపై దుమారం చెలరేగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌తో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన చంద్రబాబు ప్రస్తుతం పార్టీలోని ఇతర నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తులపై నీలి నీడలు కమ్ముకుంటుంటున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల్లో పలువురు నాయకులు ఈ కలియికపై పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీలో ఎన్టీఆర్ తరం నాయకులైతే కాంగ్రెస్‌తో పొత్తు ససేమిరా అంటున్నారు. ఏ పార్టీ పరిపాలనా విధానాలు నచ్చక టీడీపీ ఆవిర్భవించిందో, అదే పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం తగినది కాదంటున్నారట. పార్టీ మూల సిద్దాంతాన్ని పక్కన పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ పాత తరం నాయకులు కుండబద్దలుకొట్టి మరీ చెబుతున్నారట. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో కూడా ఒక వర్గం నేతలు టీడీపీతో పొత్తు విషయమై అయిష్టతతో ఉన్నా, పార్టీ  ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు అనివార్యమనే భావనకు వచ్చేశారు. కానీ టీడీపీ పాత తరం నాయకులు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు అంటే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.