ఉక్కు దీక్షకు ఊహించని వ్యక్తుల మద్దతు

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష పది రోజులు పూర్తి చేసుకుంది. ఒకవైపు ఆరోగ్యం క్షిణిస్తున్నా.. ఆయన మాత్రం దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన నడవ లేకపోతున్నారు. కాలకృత్యాలకు కూడా సహచరులే తీసుకెళ్తున్నారు. వైద్యులు దీక్ష విరమించాలని ఎంత నచ్చజెబుతున్నా ఆయన ససేమిరా అంటున్నారు. ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ క్రమంగా పడిపోతున్నాయని, ఒకట్రెండు రోజులు దీక్షలో కొనసాగితే ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఉక్కు సంకల్పంతో సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు ప్రముఖుల మద్దతు పెరుగుతోంది.

సీఎం రమేష్ దీక్షకు ఊహించని వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి చెందని పలువురు సీఎం రమేష్ దీక్షను కొనియాడుతున్నారు. సీఎం రమేష్ దీక్షకు వస్తున్న మద్దతు చూసిన టీడీపీ శ్రేణులు, పలు రాజకీయ పార్టీలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ముందుగా.. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఉద్యోగాన్ని వదిలేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం రమేష్‌కు సంఘీభావం తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోడానికి వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. శుక్రవారం దీక్షా స్థలికి వెళ్లి సీఎం రమేష్‌ను పరామర్శించారు. ఆయన మంచి సంకల్పంతో దీక్ష చేస్తున్నారని మాజీ జేడీ కొనియాడారు.


అనంతరం ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ సీఎం రమేష్ దీక్షకు మద్దతు తెలిపాడు. ఇందుకోసం ఆయన కడప చేరుకుని, రమేష్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దీక్షను విరమించాలని కోరారు. గణేష్ కోరికను సీఎం రమేష్ సున్నితంగా తిరష్కరించారు. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే బండ్ల గణేష్ కడప వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ కూడా రమేశ్‌కు సంఘీభావం తెలిపారు. అంతేకాదు ఆంధ్రా ఆక్టోపస్ కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు.

లగడపాటి రావడంతో తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఎన్నికల సర్వేలు నిర్వహిస్తోన్న లగడపాటి సీఎం రమేశ్‌కు మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకు ముందు తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి కడపకు వచ్చి మరీ తోటి ఎంపీ సీఎం రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. అలాగే హీరో శివాజీ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు ప్రముఖులు ఉక్కు దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ, జనసేన తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పార్టీల అధినేతలు మద్దతు ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.