చంద్రబాబు ఎంట్రీ.. దీక్ష విరమించిన సీఎం రమేష్

టీడీపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ దీక్షను విరమించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలంటూ నిరాహార దీక్షకు దిగిన సీఎం రమేష్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ నెల 20వ తేదీన ఏపీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్.. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఆమరణ దీక్షకు దిగారు. జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్షకు దిగారు. అయితే బీటెక్ రవి ఆరోగ్యం క్షిణించడంతో.. ఈ నెల 27న పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.

పదకొండు రోజుల పాటు సీఎం రమేష్ నిరాహార దీక్ష చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షిణించింది. ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ క్రమంగా పడిపోతున్నాయని, ఒకట్రెండు రోజులు దీక్షలో కొనసాగితే ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు ప్రకటించడంతో సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఈరోజు మంత్రి నారా లోకేష్‌తో కలిసి దీక్షా స్థలికి చేరుకున్న ఆయన ‘‘కేంద్రంతో మరోసారి మాట్లాడుతా. దీని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఢిల్లీ పంపిస్తా. ఉక్కు ఫ్యాక్టరీ సాధించేవరకు అందరం కలిసి నిరంతరాయంగా పోరాటం చేద్దాం. కాబట్టి మీరు తక్షణమే దీక్షను విరమించండి’’ అని రమేష్‌ను కోరారు. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన టీడీపీ ఎంపీ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే చంద్రబాబు ఆయనకు నిమ్మరసం తాగించారు.

మరోవైపు సీఎం రమేష్ చేసిన ఉక్కు దీక్షకు పార్టీలకతీతంగా మద్దతు లభించింది. ఆయన దీక్షకు టీడీపీ నేతలే కాకుండా మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్, లగడపాటి రాజ గోపాల్, హీరో శివాజీ సహా పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఉక్కు దీక్ష వల్ల ఫ్యాక్టరీ ఏమోగానీ కడపలో టీడీపీకి బాగా అనుకూల స్పందన వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఆ పార్టీ నేతలు అనుకూలంగా మలచుకుంటున్నారు. దీంతో ప్రతిపక్ష వైసీపీలో కొంత కలవరం మొదలైందని టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.