బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం ప్లాన్

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చేశాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉండడంతో, ఆ పార్టీకి బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల సహాయంతోనే మోదీని అధికారానికి దూరం చేయాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆ పార్టీ ఇప్పటికే కొన్ని త్యాగాలకు కూడా సిద్ధమైంది. గెలుస్తామని నమ్మకమున్న స్థానాల్లోనే పోటీ చేయడంతో పాటు, అవసరమైతే ప్రధాని పదవిని కూడా వదులుకుంటామని విపక్షాలతో అన్నట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ప్రధాని పదవిపై కన్నేసిన కొంత మంది జాతీయ స్థాయి నేతలు అలెర్ట్ అయ్యారు. అందులో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎప్పటి నుంచో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ కోసం వచ్చే ఏడాది జనవరి 19న నిర్వహించే ర్యాలీకి అందరినీ ఆహ్వానించేందుకు ఆమె రెండు రోజుల కిందట ఢిల్లీలో దేవెగౌడ సోనియా, రాహుల్, కేజ్రీవాల్ వంటి నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఆమె ర్యాలీ కోసం వాళ్లను కలిశారా..? లేక ప్రధాని పదవి కోసం చర్చలు జరిపారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి ప్రధాని పదవి ఆశిస్తున్న వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, మమత, బీఎస్పీ నాయకురాలు మాయావతి ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ కూడా రేసులో నిలిచారు. గతంలో ఎవరికి వారుగా ప్రధాని పీఠంపై కన్నేసిన వీరంతా… ఇప్పుడు ‘ముందు మోదీని ఓడించడమే ముఖ్యం’ అనే ఉమ్మడి లక్ష్యంతో ఏకమవుతున్నారు. ‘మోదీ హఠావో’ నినాదాన్ని నిజం చేసేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా మమతకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.