చంద్ర‌బాబు గీసిన ఎల‌క్ష‌న్‌ ప్లాన్ ఇదే !

తెలంగాణ‌లో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రోజులు గ‌డిచేకొద్దీ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెరుగుతోంది. దీంతో గులాబీ ద‌ళానికి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు విజ‌యంపై ధీమాగా ఉన్న కేసీఆర్ సైతం ఇప్పుడు ప‌రాజ‌యం మాటెత్తుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప్ర‌జా కూట‌మి విజ‌యం త‌థ్య‌మ‌ని ప‌లు స‌ర్వేలు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ – టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు క‌లిసిక‌ట్టుగా ప్ర‌చారం చేస్తుండ‌టం రాష్ట్రంలో ప్ర‌జా కూట‌మికి మ‌రింత జోష్‌నిస్తోంది.
ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రావ‌డం టీటీడీపీ వ‌ర్గాల్లో, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపింది. ఖ‌మ్మంలో చంద్ర‌బాబు స‌భ భారీగా స‌క్సెస్ అయ్యింది. అయితే – అస‌లు ఆట‌ ఆ తర్వాతే మొద‌లైంది. ఖ‌మ్మం నుంచి నేరుగా హైద‌రాబాద్ చేరుకున్న చంద్ర‌బాబు రెండు రోజులుగా అక్క‌డే మ‌కాం వేశారు. టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్ షోలు నిర్వ‌హించారు. ఆయ‌న స‌భ‌లు, రోడ్ షోల‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.
గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగాల్లో కేసీఆర్‌పై విరుచుకుప‌డుతున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఏ విష‌యానికి తాను అడ్డుప‌డ్డానో చెప్పాలంటూ నిల‌దీస్తున్నారు. తెలంగాణ‌కు ప్ర‌ధాన అర్థిక వ‌న‌రుగా ఉన్న‌ సైబ‌రాబాద్ త‌న మాన‌స పుత్రికేన‌ని ఉద్ఘాటించారు. ఈ విష‌యాన్ని నీ పిల్ల‌లు కేటీఆర్‌, క‌విత కూడా గ‌తంలో అంగీక‌రించారంటూ గుర్తుచేశారు.
చంద్ర‌బాబు తీరు చూస్తుంటే ఆయ‌న హైద‌రాబాద్‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌హాన‌గ‌రంలో అధిక స్థానాలు గెల్చుకొని కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని ఆయ‌న వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జా కూట‌మి పొత్తుల్లో భాగంగా త‌మ‌కు కేటాయించిన సీట్ల‌లో సింహ‌భాగాన్ని జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే ఆయ‌న ఎంచుకున్నారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఏకంగా నంద‌మూరి వార‌సురాలిని బ‌రిలో దించారు. రెండు రోజులుగా న‌గ‌రంలోనే ఉండి ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు.
చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో మెజారిటీ స్థానాల గెల్చుకోవ‌డంపై దృష్టిపెట్ట‌డం వెనుక రాజ‌కీయ విశ్లేష‌కులు పలు కార‌ణాలు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్య‌మైన‌వి.. తెలంగాణ‌కు హైద‌రాబాద్ గుండెకాయ‌. ఇక్క‌డ టీఆర్ఎస్‌ను దెబ్బ‌తీస్తే దాని ప్ర‌భావం రాష్ట్రమంత‌టా ఉంటుంది. ఇప్ప‌టికే న‌గ‌రంలో మ‌జ్లిస్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌. క‌నీసం 5-6 స్థానాలు వాళ్లే ద‌క్కించుకుంటారు. అందులో అనుమానం లేదు. ఇక మిగ‌తా స్థానాల్లో టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-టీడీపీల బ‌లాబ‌లాలు దాదాపుగా స‌మాన‌మే. ఇంకా చెప్పాలంటే టీడీపీదీ మొగ్గు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ తెలంగాణ‌లో అత్య‌ధిక స్థానాలు గెల్చుకున్న‌ది జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే. ఈ స్థానాల్లో సెటిల‌ర్లే ఎక్కువ‌గా ఉన్నారు. కాబ‌ట్టి వారిని త‌మ వైపుకు తిప్పుకోవ‌డం సుల‌భ‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. హైద‌రాబాద్‌ను సాంకేతిక రంగంలో ప‌రుగులు పెట్టించింది ఆయ‌నేన‌న్న భావ‌న న‌గ‌ర‌వాసుల్లో ఉండ‌టం కూడా ఇందుకు క‌లిసొచ్చే అంశ‌మే.
తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసేదెవ‌రో తేల్చేది జీహెచ్ఎంసీ సీట్లేన‌ని చంద్ర‌బాబు విశ్వ‌సిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఇక్క‌డి స్థానాల‌పై దృష్టి కేంద్రీక‌రించారు.
దేశమంత‌టా మోడీ వ్య‌తిరేక గాలి వీస్తోంది. న‌గ‌రాల్లో అది మ‌రీ ఎక్కువ‌. అందుకే హైద‌రాబాదుపై దృష్టిపెడితే మోడీ -టీఆర్ఎస్ ఒక‌టే కాబ‌ట్టి మోడీ వ్య‌తిరేకులు ప్ర‌జాకూట‌మిని ఆద‌రిస్తారు. ఎలాగూ ప్ర‌త్యేక హోదా కోసం కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తారు. ఎందుకంటే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇవ్వ‌గ‌లిగిన కాంగ్రెస్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. జిల్లా లెవెల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ డీ అంటే డీ అంటున్నాయి. ఈ నేథ్యంలో న‌గ‌రాన్ని ప్రభావితం చేస్తే అధికారం మ‌న‌దే అని చంద్ర‌బాబు వ్యూహం. అందుకే ఇక్క‌డ పూర్తిగా దృష్టిపెట్టారు. మ‌రి చంద్ర‌బాబు వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే!

1 Comment

  1. తన పాలనలో మత విద్వేషాలు రగిలే నిర్ణయాలతో మైనారిటీ, బలహీన వర్గాల్లో అభద్రతభావం కలిగించి, పెద్దనోట్ల రద్దు,GSTలతో పెట్టుబడిదారులకు మేలు కలిగేలా,పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడేలా చేసిన మోడీ బీజేపీని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రాంతీయ విద్వేషాగ్ని రగిల్చే మాటలు తప్ప తన చెత్తపాలనతో తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగు చేయకపోగా మరింత అధోగతికి తీసుకుపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి యువతను నిరుద్యోగులుగా మార్చిన కేసీఆర్ టీఆర్ఎస్ కు తెలుగు ప్రజానీకం ఏకమై తమ ఓటుతో బుద్ధి చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.