చంద్రబాబు ఇలా చేయడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై తిరగబడిన టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీపై పోరాటం చేస్తూనే ఉంది. గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఆ పార్టీ ఎంపీలు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి రావాల్సిన నిధులను ఆపేయడం.. టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయించడం.. ప్రతిపక్షాలతో లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయిస్తోందని స్వయానా చంద్రబాబే స్టేట్‌మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రంపై ఎదురుదాడికి దిగారాయన. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని సీఎం నిర్ణయించుకున్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు.

తాజాగా గురువారం ఢిల్లీ వెళ్లి పలువురు ప్రముఖులతో చర్చలు జరిపారు చంద్రబాబు. మొదట శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలతో భేటీ అయిన ఆయన తర్వాత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. వీరి మధ్య రాఫెల్ ఒప్పందం, సీబీఐలో కలకలం, సహా పలు జాతీయ, ప్రాంతీయ వ్యవహారాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు చంద్రబాబు ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ అవడం చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి. గతంలో అంటే 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అంటే 20 ఏళ్ల తర్వాత ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆ కలయిక తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అసలు ఏ విధమైన చర్చలు జరగలేదు. తాజాగా చంద్రబాబు-రాహుల్ కలిశారంటే ఆ క్రెడిట్ బీజేపీకే దక్కుతుందని చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.