తెలంగాణ టీడీపీలో గంద‌ర‌గోళం

జగిత్యాల జిల్లా తెలుగుదేశంపార్టీ పరిస్థితేం బాగోలేదు.. కొంచెం గాడిన పడుతున్నారనుకునేలోగా గాడి తప్పుతున్నారు తెలుగు తమ్ముళ్లు.. సరిగ్గా ఏడాది కిందట ఆకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి నలుగురి దృష్టిలో పడ్డారు టీడీపీ నేతలు.. ఇదంతా చూసి రమణ లేని లోటును బాగానే పూడుస్తున్నారే అని అనుకున్నారు టీడీపీ పెద్దలు.. ఇది జరిగి ఏడాదయ్యాంది.. అప్పుడు పరామర్శలు చేసీ చేసీ అలసిపోయినట్టున్నారు.. ఇంకా ఆ బడలిక తీరలేదు కాబోలు.. ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదు.. జగిత్యాల జిల్లా మామిడి రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అసలే ఈ ఏడాది ఆలస్యంగా కాపు వచ్చింది. దీనికి తోడు గిట్టుబాటు ధర కూడా రాక మామిడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో గాలి బీభత్సానికి మామిడి కాయలు నేలరాలాయి.. వరిపంట నేలకొరిగింది. ఇతర పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇన్ని జరిగినా ఒక్కరంటే ఒక్కరు కూడా రైతులను పరామర్శించలేదు. పాపం జనాలు కూడా ప్రస్తుతం ఉన్న నేతలను పార్ట్‌టైమ్‌ లీడర్లుగానే పరిగణిస్తున్నారు.. ఫుల్‌టైమ్‌ లీడర్లుగా గుర్తించడం లేదు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదట్లో ఇక తెలుగుదేశంపార్టీకి తిరుగులేదన్న రేంజ్‌లో పనిచేశారు తెలుగు తమ్ముళ్లు.. అ,యితే గడచిన ఆరేడు నెలలుగా వారిలో నీరసం ఆవరించింది.. కారణం పార్టీ కార్యక్రమాలలో వారు పాల్గొంటున్నా అనుకున్నంతగా స్పందన రాకపోవడం! పార్టీ కార్యక్రమాలలో కొద్ది మంది కార్యకర్తలు మినహా ప్రజలు కనిపించడం లేదు. ఎంత చేసినా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదట! దీనికి తోడు అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా ఇక్కడకు ఎప్పుడో తనకు వీలున్నప్పుడు వచ్చి వెళుతున్నారు. జగిత్యాల తమ్ముళ్లకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. గడపగడపకు తెలుగుదేశం లాంటి కార్యక్రమాలతో కొద్దిగా బిజీ అయినా ప్రజల నుంచి అనుకున్నంత రెస్పాన్స్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు. కొందరేమో చేద్దాం… ముందుకు వెళదాం అంటున్నారు. మరికొందరేమో చూద్దాం అంటున్నారు. ఇలా భిన్నమైన అభిప్రాయాలతో తమ్ముళ్లు ఢీలా పడుతున్నారు. సరే ఇదంతా కొద్ది సేపు పక్కన పెడితే.. తమ్ముళ్ల మనసులో మాత్రం ఓ కోరిక చాలా బలంగా ఉందట! ఇప్పటికే ఇక్కడ జనహిత ప్రగతి సభ పేరుతో టీఆర్‌ఎస్‌ పెద్ద బహిరంగ సభ పెట్టింది. మొన్నామధ్యన నాలుగువేల ఇళ్లు కేటాయించిన సందర్భంగా అధికారికంగా మరో సభను ఏర్పాటు చేసింది అధికారపక్షం.. ఇక ఎంపీ కవిత ఎలాగూ ఉండనే ఉన్నారు. అలా టీఆర్‌ఎస్‌ సభలతో ఆ పార్టీ మైలేజీ బాగానే వచ్చింది.. మరోవైపు గత ఏడాది కాంగ్రెస్‌పార్టీ కూడా జన ఆవేదన సమ్మేళనం అంటూ జీవన్‌రెడ్డి నేతృత్వంలో బహిరంగ సభ పెట్టింది. ఇలా అటు టీఆర్‌ఎస్‌.. ఇటు కాంగ్రెస్‌ పార్టీలు కార్యకర్తలలో జోష్‌ నింపేందుకు సభలు పెట్టుకున్నాయి.. టీడీపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సభను నిర్వహించలేదు. మనం కూడా అలాంటి సభ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. లాస్టియర్‌ మినీమహానాడును ప్లాన్‌ చేసినప్పటికీ అది వర్క్‌ అవుట్‌ కాలేదు. మధ్యలో రేవంత్‌రెడ్డితో సభ పెట్టాలనుకున్నారు.. ఎందుకో అది కూడా కార్యరూపం దాల్చలేదు.. రేవంత్‌ కాస్తా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పడు మాత్రం సభ కచ్చితంగా పెట్టాల్సిందేనని ఫిక్సయ్యారు. సభతో పార్టీ బలమేమిటో తెలుసుకోవచ్చని అనుకుంటున్నారు. మనం బలంగా ఉంటేనే మిగతా పార్టీలు పొత్తుకు ముందుకు వస్తాయని ఇటీవల చంద్రబాబు చెప్పిన మాటను చెవికెక్కించుకున్న నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.. మరి బహిరంగసభతో పార్టీ బలపడుతుందా..? తమ్ముళ్ల ఆశలు నెరవేరతాయా? అన్నది చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.