వైసీపీలో లుకలుకలు.. వాళ్ల చూపు జనసేన వైపు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో పార్టీలన్నీ యాక్టివ్ అయిపోయాయి. ప్రతి పార్టీ ప్రజలతో మమేకం అయ్యేందుకు పలు కార్యక్రమాలు కూడా చేస్తోంది. ప్రతిపక్షాలతో పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ఉత్సాహంగా తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే, 2019లో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. సీఎం అవ్వాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. అందుకోసం ఎన్ని ప్లాన్లు వేసినా సక్సెస్ అవ్వకపోగా, ఆయనకే ప్రతిబంధకంగా మారిపోతున్నాయి. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి, ఆ పార్టీ హైకమాండ్ దగ్గరకు వెళ్లినా జగన్‌ను సీఎం చేయలేదు. దీంతో అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవినే టార్గెట్‌గా పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. దీంతో వైఎస్ అనుచరులందరూ ఆ పార్టీలోకి వచ్చేసినా, రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ.. ప్రజలను మెప్పించలేకపోతుంది. తాజాగా జరిగిన పరిణామంతో ఆ పార్టీలో లుకలుకలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలతో వచ్చిన వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోయిన ఆ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి నేతలు, కాపు రిజర్వేషన్లపై చేసిన ప్రకటనతో అవాక్కయ్యారు. 2019 ఎన్నికల్లో గెలుపు కోసం నాలుగేళ్లుగా తాము పడ్డ కష్టం అంతా జగన్‌ గత వారం రోజుల్లో చేసిన వ్యాఖ్యలతో తుడిచిపెట్టుకుపోయిందని కొందరు వైసీపీ నేతలు అంటున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా ప్రజల్లో ఉంటూ, అనేక వ్యయప్రయాసల కోర్చి పార్టీ బలోపేతానికి కృషిచేశామని, పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు, కాపు రిజర్వేషన్‌ అంశంపై తొలుత చేతులెత్తేయడం.. మళ్లీ యూ టర్న్ తీసుకోవడం వంటి వాటి వల్ల అవన్నీ వృథా అయిపోయాయని ఆ పార్టీలోని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు, జగన్‌ వైఖరి రాష్ట్రంలోని కాపుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ప్రభావం చూపడం ఖాయమని, దానిని పూడ్చుకోనట్టయితే వచ్చే ఎన్నికల్లో విజయంపై ఆశలు వదులుకోవాల్సిందేననే వారు భయపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, తాజాగా జగన్ కాపు రిజర్వేషన్లపై యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో వైసీపీకి జరిగే ప్రయోజనం ఏమీ లేదని, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకోవల్సిందేనని ఆ పార్టీలోని కాపు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాపు నేతలంతా త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు అధికార పార్టీలోకి రావాలని భావించినా.. ఆ పార్టీలో ఇప్పటికే హౌస్ ఫుల్ అవడం వల్ల కొంత మందికే ఛాన్స్ ఉన్నదని, మిగతా వారు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఎలాంటి చతురత ప్రదర్శిస్తాడో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.