ఆమెను పార్టీలో చేర్చుకోవడంతో జగన్‌పై విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా దాదాపు ఎనిమిది నెలల గడువున్నా.. పార్టీలు మాత్రం తెగ హడావిడి చేసేస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు జరగగా.. ఈ సారి జనసేన కూడా ఎంటరవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీనితో పాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రభావం చూపాలని ఆశ పడుతున్నాయి. ఈ కారణంగా ఈ సారి ఎన్నికల్లో ప్రతిపక్షాలు వీడిపోనున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఫలితంగా అధికార పార్టీకి ప్లస్ అవుతోంది. ఇప్పుడిదే ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కలవరపెడుతోంది. అందుకోసం వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న జగన్.. అందుకోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నాడు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మరోసారి రిపీట్ చేయకుండా ఉండేందుకు పక్కగా ప్లాన్ చేయాలనుకుంటున్నాడని టాక్. ఎప్పటి నుంచో గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవాలని అనుకున్న ఆయన పీకే బృందంతో సర్వే కూడా చేయించుకున్నాడు. దాని ఫలితాల ఆధారంగానే నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించాలని అనుకున్నాడు. కానీ, ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

సర్వే ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థోమత చూసి టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్లు చిలకలూరిపేటలో జరిగిన ఘటనతో ఆ పార్టీ నేతలకు అవగతమైంది. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా వ్యవహరించటమే కాకుండా 2004 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మర్రి రాజశేఖర్‌ జగన్‌ పిలుపుతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. అయినా పార్టీకి అండగా ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలుపొందిన ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ అనేక అంశాలపై ఆయనతో సైతం పోరాడుతూ రాజశేఖర్‌ పార్టీ పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటూ వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో మంత్రి పుల్లారావును ఢీకొనే ఆర్థిక స్థోమత మర్రి రాజశేఖర్‌కు లేదని భావించిన జగన్‌ కొద్దికాలంగా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇక్కడ వేరే అభ్యర్ధిని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే టీడీపీలో నుంచి వైసీపీలో చేరిన రజనికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాడు. దీంతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

ఒకవైపు రాజశేఖర్ వర్గం బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం కూడా లేని ఆమెకు ఏకంగా నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంతో రాజశేఖర్‌ అభిమానులు ఈ విషయమై పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లినా ఆయన లైట్ తీసుకున్నాడు. పార్టీలోని మరోవర్గం వాదన వేరేలా ఉంది. గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు సభ వేదికపై ‘‘పిల్లలతో కలిసి ఇంట్లో ఏదైనా హర్రర్ సినిమా చూస్తుంటే వారు భయపడతారని చూడనివ్వం. వారు ఎందుకని ప్రశ్నిస్తే అందులో రాక్షసుడు ఉంటాడని చెప్తాం. రాక్షసుడు ఎలా ఉంటాడు అని వారు ప్రశ్నిస్తే మాత్రం ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ ఫొటో చూపిస్తే సరిపోతుంది’’ అని చెప్పి సంచలనం రేకెత్తించింది. దీంతో ఆమె ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ఈ విషయాన్నే వైసీపీలోని రెండో వర్గం లేవనెత్తుతోంది. అప్పుడు అన్ని విమర్శలు చేసిన నేతను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా.. ఆమెకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే కొనసాగితే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని వారిలో వారే చర్చించుకుంటున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.