వైసీపీలో విడని వివాదాలు.. వరుస విబేధాలు

వైసీపీని నిత్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. వరుస విబేధాలతో ఆ పార్టీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. చిలకలూరిపేట వివాదం ఇంకా చల్లారకముందే కావలిలో కలహాలు మొదలయ్యాయి. తాజాగా కొండెపి వ్యవహారం తెరమీదకు వచ్చింది. అక్కడి కోఆర్డినేటర్ మార్పు వ్యవహారం ఇప్పుడు పార్టీకి సమస్యలను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ పట్టుకోసం ప్రయత్నిస్తున్న  నేతల మధ్య పంతాలు పెరిగిపోతున్నట్లు సమాచారం. వైసీపీలో ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా హెచ్చరికలు చేశారు. మాజీ కోఆర్డినేటర్ కూడా తాను తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని హెచ్చరించారని తెలుస్తోంది. కొండెపి నియోజకవర్గ కోఆర్డినేటర్ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతున్నట్లు సమాచారం. వరికోటి అశోక్ బాబుని తొలగించడంతో ఆయన భగ్గుమన్నారు. అనుచరులతో కలిసి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేగాకుండా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై దుమ్మెత్తిపోసినట్లు తెలుస్తోంది. ఆయన తన మద్ధతుదారులతో సమావేశమైన తర్వాత పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా ఉంటానని ప్రకటించారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం కోట్లు వెచ్చించిన దళితనేతను మోసం చేశారంటూ ఆయన విమర్శలకు దిగుతున్నారు. చేశారు. గత ఎన్నికలలో బాపట్ల లోక్‌సభకు పోటీ చేసిన తన సోదరుడు డాక్టర్‌ అమృతపాణి కూడా పార్టీ కోసం ఆర్థికంగా నష్ట పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ పార్టీ ఎంతమాత్రం కృతజ్ఞత చూపలేదని ఆరోపించారు.
మరోవైపు కోఆర్డినేటర్ మార్పుని సమర్థిస్తూ మరికొందరు నేతలు తమ వాదనను వినిపిస్తున్నారు. వారంతా డాక్టర్‌ వెంకయ్యకు మద్దతుగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఒంగోలులోని రిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ వెంకయ్య ఇప్పటికే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందిన తర్వాతనే కోఆర్డినేర్ గా నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అలాగే గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు అంశం జిల్లా వైసిపిలో తీవ్ర కలకలం రేపింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ను ఒక మహిళా ఎన్నారైకు ఇవ్వబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం ఆ నియోజకవర్గం వైకాపాలో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. దీంతో ఇటీవలికాలం వరకూ వైకాపాకు జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తాజా పరిణామాలతో టిడిపిలో చేరేందుకు సంసిద్దులయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల సమరానికి ఇంకా గడువు ఉండగానే వైసీపీలో టికెట్ల రగడ ప్రారంభమైందని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.