బొగ్గు గ‌నుల్లో రాజ‌కీయం వేడెక్కుతుంది

తెలంగాణలో భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ భూపాలపల్లికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారికి తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ పదవిని కట్టబెట్టి గౌరవించారు. మొదట్లో ఈ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్ బలంగానే ఉంది. తర్వాత తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి మారింది. భూపాలపల్లిపై పలువురు దృష్టి సారించారు. స్పీకర్ మధుసూదనాచారితో పాటు ఎమ్మెల్సీ కొండా మురళి, టీఆర్ఎస్ నేత గండ్ర సత్యనారాయణరావు, కేటీఆర్ సన్నిహితుడుగా పేరున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ టిక్కెట్ ఆశిస్తూ ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్ఎస్ స్థాపనలోనూ కీలకపాత్ర పోషించిన మధుసూదనాచారికి సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎవరి ప్రయత్నాల్లో వారు టిక్కెట్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్పీకర్ వర్సెస్ కొండా మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. దీంతో ఈ నాలుగుస్తంభాలాట మరింత రసకందాయంలో పడింది.శాసనసభను ఆర్డర్‌లో నడిపించే స్పీకర్ మధుసూదనాచారి తన సొంత నియోజకవర్గాన్ని మాత్రం ఆర్డర్‌లో ఉంచలేకపోతున్నారట. కుమారుల జోక్యం, వ్యతిరేకుల సొంత కుంపటి, పార్టీలోనే ప్రత్యర్ధులు తయారవడం వంటి కారణాలతో స్పీకర్ నియోజకవర్గం టిక్కెట్‌పై అయోమయం నెలకొన్నది. ఈ తరుణంలో కేటీఆర్ ఆశీస్సులతో రావాలనుకుంటున్న కొత్త నేతలతో గులాబీదళం నాలుగు ముక్కలైంది.ఇదే సమయంలో మరో సన్నివేశం తెరపైకి వచ్చింది.

స్పీకర్‌తో వ్యక్తిగత ద్వేషం ఉన్న నేపథ్యంలో కొండా మురళి- సురేఖ దంపతులు భూపాలపల్లిపై దృష్టిపెట్టారు. సీరియస్‌గా తమ కూతురు సుస్మితాపటేల్‌ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొదట్లో వరంగల్ పశ్చిమ, ఆ తర్వాత పరకాల టిక్కెట్లు ఆశించారు. అయితే ఈ రెండుచోట్ల తనకు అవకాశం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో భూపాలపల్లిపై దృష్టిపెట్టారు. పరకాల నియోజకవర్గంలోని వరికోల్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి తన ఇమేజ్‌తో పాటు పరపతిని ఉపయోగించి పార్టీలో సొంత కుంపటి పెట్టారు.మొత్తంమీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీకోటలో గుబులు పుట్టించే రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అధిష్టానం సీరియస్‌గా గమనిస్తోంది అసలు భూపాలపల్లిలో ఏం జరుగుతోంది? ఎవరెవరు ఆశావహులుగా ఉన్నారు? అన్న విషయాలతోపాటు వారి బలాబలాలపై సీఎం కేసీఆర్‌ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రప్పించుకున్నారట. ఆ తర్వాతే “సిటింగ్‌లకే పార్టీ టిక్కెట్లు” అంటూ గులాబీ వేదికపై నుంచి ఆయన ప్రకటించడం ఆశావహులకు ఏమాత్రం రుచించడం లేదు. అయినప్పటికీ.. తమ ప్రయత్నాలు విరమించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.