బాబు.. మాట వింటారంటారా

టీడీపీను ఓడించేందుకు.. బ‌య‌ట నుంచి శ‌త్రువులు అవ‌స‌రం లేద‌ట‌.. అంత‌ర్గ‌తంగా ఉన్న కొంత‌మంది నేత‌లు చాల‌ట‌. ఇదేదో.. విప‌క్షాల విసుర్లు కాదు స్వ‌ప‌క్షంలోని కొంద‌రి సీనియ‌ర్ల ఆవేద‌న‌. టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి గుంటూరు జిల్లా నేత‌లు స‌కాలంలో రాక‌పోవ‌టంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు. పైగా.. నాకేమైనా ప‌నిలేకుండా వ‌చ్చాన‌నుకుంటున్నారా.. లేక‌పోతే.. పార్టీకు మ‌న‌మే అవ‌స‌ర‌మ‌నే అతి ఆత్మ‌విశ్వాసం త‌లకెక్కిందా అనే రేంజ్‌లో చంద్ర‌న్న నాలుగేళ్ల స‌మ‌యంలో తొలిసారి విశ్వ‌రూపం చూపారు. అదీ గుంటూరు జిల్లా నేత‌ల మీద‌నే కావ‌టం చ‌ర్చ‌నీయాంశం. టీడీపీ కంచుకోట గుంటూరు, కృష్ణాజిల్లాలు. అటువంటి కీల‌క‌మైన చోట‌… ఎవ‌రి వ‌ర్గం వారిది.. సొంత‌పార్టీ ఎమ్మెల్యేల‌ను ఓడించాల‌నేంత క‌క్ష‌లు.

ఎవ‌రు గెలిస్తే.. ఎవ‌రికి పోటీ అవుతార‌నే భ‌యం కూడా ఆ రెండు జిల్లాల్లోనే ఉంది. పైగా గుంటూరు వంటి చోట‌.. ఈ పైత్యం.. అన్ని పార్టీల్లోనూ వేధిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీల‌కు ఈ ఇబ్బంది మ‌రింత ఎక్కువ‌.  న‌ర్స‌రావుపేట‌, గుంటూరు ఎంపీలిద్ద‌రూ.. టీడీపీ నుంచి వ‌చ్చిన‌వారు కాదు. పైగా అప్ప‌టి వ‌ర‌కూ వ్య‌తిరేకంగా ప‌నిచేసిన కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన గ‌ల్లా జ‌య‌దేవ్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. పేరుకే ఎంపీలైనా..  సాధార‌ణ  కార్య‌క‌ర్త‌లు వారి వ‌ద్ద‌కు వెళ్లిన దాఖ‌లాల్లేవు. ఎందుకంటే జ‌య‌దేవ్‌.. నాన్‌లోక‌ల్‌.. బిజినెస్‌మెన్‌గా త‌ర‌చూ యాత్ర‌ల్లో.. విధుల్లో త‌ల‌మున‌క‌లై టూర్ల‌లో.. డిల్లీలో ఉంటారు.  వేణుగోపాల‌రెడ్డి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆయ‌న‌కూడా.. ప‌క్క పార్టీ నుంచి వ‌చ్చి ఎంపీగా గెల‌చి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు నేత‌లు.. ఆయ‌న్ను నాన్‌లోక‌ల్‌గానే ప‌రిగ‌ణించారు. ఇక మాజీ మంత్రి రావెల చూపిన చుక్క‌లతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది.

ప్ర‌త్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్క‌య్యారు. ప‌ల్నాడులో గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు తీరు.. ప‌ల్నాట పార్టీలో మంట‌లు రేపింద‌నే చెప్పాలి.  మంత్రి న‌క్కా, ఎమ్మెల్సీ డొక్కా వంటి వారు.. పేప‌ర్ పులులుగా మాత్ర‌మే జ‌నం భావిస్తున్నారు. కృష్ణాలో దేవినేని, వ‌ల్ల‌భ‌నేని, గ‌ద్దె కుటుంబాల మ‌ధ్య బ‌య‌ట‌కు క‌నిపించేంత‌టి స్నేహం లేదు. పైగా.. మంత్రి ఉమా అంటే.. దాదాపు జిల్లాలో మిగిలిన నేత‌లంతా వ్య‌తిరేక‌త వ్య‌క్తంచేస్తుంటారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వివాదాల‌తో పార్టీను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇక బెజ‌వాడ మేయర్ కొనేరు శ్రీధ‌ర్‌.. త‌న‌కు ఎంద‌కిచ్చారీ ప‌ద‌వంటూ పెడ‌బొబ్బ‌లు పెట్టి మ‌రీ త‌న ఆవేద‌న వెలిబుచ్చారు. న‌ల్ల‌కోటు వేసుకోవ‌టానికి మిన‌హా దేనికి ప‌నికిరానంటూ కామెంట్ చేశారు. ఇలా.. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ఒక‌రి కంత‌లు ఒక‌రు వెతుక్కునే నేత‌లు.. క్ర‌మ‌శిక్ష‌ణ‌గా.. ఊరూవాడా తిరిగి.. పార్టీ ప్ర‌తిష్ఠ‌ను పెంచుతార‌నేది బాబుగారి ఆకాంక్ష. అయితే.. బాబు ఎదుట‌.. వంగివంగి దండాలు పెట్టే నేతల్లో చాలామంది.. ఆ త‌రువాత‌.. ఇష్టానుసారం చేస్తున్నార‌నేది అధినేతకు తెలియ‌న‌ది కాదు.. అయినా ఒక‌ఛాన్స్ ఇద్దామ‌నేది ఆయ‌న ల‌క్ష్యం. మ‌రి దాన్ని ఎంత‌వ‌ర‌కు ఎంత‌మంది వింటార‌నేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.