సర్వేలో సత్ఫలితాలొచ్చిన చోట టీడీపీకి కొత్త తలనొప్పి

వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని చేపట్టాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పాటు మరికొన్ని స్థానాలను గెలుచుకుని ఆధిక్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ.. అభివృద్ధే ప్రధాన ఆయుధం ఎన్నికల సమరంలోకి దూకబోతోంది. ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టేందుకు వైసీపీ బలంగా ఉన్న స్థానాలపై ఎక్కువ దృష్టి సారించింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని స్థానాలపై కన్నేశారు. వైసీపీ కంచుకోటలుగా చెప్పుకునే కొన్ని జిల్లాలపై ఇప్పటికే పట్టు సాధించిన టీడీపీ.. మరికొన్ని చోట్ల ఆధిపత్యం కోసం పరితపిస్తోంది. ఇందుకోసం ముఖ్యంగా రాయలసీమలోని పలు జిల్లాలను టార్గెట్ చేసింది. గత ఎన్నికల్లో ఆ జిల్లాల్లో తక్కువ స్థానాలు గెలుచుకోవడమే దానికి కారణంగా తెలుస్తోంది. వీటిలో ముందుగా కర్నూలు జిల్లాను ఎంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. భూమా కుటుంబంతో పాటు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. దీనితో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు అక్కడి ప్రజలు సంతృప్తిగా ఉండడంతో టీడీపీ గ్రాఫ్ పెరిగిపోతోంది. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో టీడీపీకి కొత్త తలనొప్పి మొదలైందట.

మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే 27 సార్లు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పాలనపై కొన్ని నియోజకవర్గాల్లో 65 శాతం వరకు సంతృప్తి ఉంటే.. మరికొన్నింటిలో 85 శాతం సంతృప్తి ఉన్నట్లు ప్రభుత్వం చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా తెలుస్తోంది. కానీ నియోజకవర్గాల్లో అధికారపార్టీ నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు నియోజకవర్గం టికెట్‌ ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ తనయుడు టీజీ భరత్‌ ఆశిస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. జూన్‌ 9,10 తేదీల్లో జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్‌ కర్నూలు ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రకటించారు. దీంతో ఎస్వీకి టికెట్‌ ఖాయమని ఆయన వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. ఇది టీజీ వర్గానికి రుచించలేదు. సర్వేలో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే సీఎం టికెట్‌ ఇస్తారని టీజీ వర్గం గట్టిగా చెబుతోంది.

నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కోడుమూరులోనూ ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే మణిగాంధీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎవరి వర్గాలు వారు బలోపేతం చేసుకుంటున్నారు. పాణ్యం నియోజకవర్గంలో ఓ వర్గం.. నాయకుల తీరుపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో ఇన్‌చార్జి వీరభద్రగౌడు కలుపుకుని పోతున్నా ఓ వర్గం ఆయనకు సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిల ప్రియ, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీఎం చంద్రబాబు సయోధ్య కుదిర్చినా… క్షేత్ర స్థాయిలో రెండు వర్గాల కార్యకర్తలు కలిసి పనిచేయడం లేదని తెలుస్తోంది. పత్తికొండ, నంద్యాల, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో దశాబ్దాలుగా పార్టీ జెండాను భూజానకెత్తుకుని పనిచేసిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత జిల్లాపై ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.