అంతంలేని కడప తమ్ముళ్ల కుమ్ములాటలు

కడప నేతల అంతర్గత వివాదాలు ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సమీపిస్తున్న ఎన్నికలు, మరోవైపు పెరిగిపోతున్న నేతల వివాదాలు కలిసి పార్టీకి తలవంపులు తెచ్చేవిధంగా మారాయని సమాచారం. గత ఎన్నికల వరకూ జిల్లాలోని నేతల మధ్య పెద్దగా వివాదాలమాట వినిపించిందే లేదట. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళపాటు నేతలు ఎలాగో నెట్టుకొచ్చేశారు. అయితే అధికారంలోకి రావడం, దీనికితోడు జమ్మలమడుగు ఎంఎల్ఏ ఆది నారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించినప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ప్రాబల్యం ఎక్కువైపోవటంతో నేతల విభేదాలు రోడ్డున పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని రమేష్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. దీనిని మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తుండటంతో జిల్లాలో వివాదాలు పెరిగిపోతున్నారని సమాచారం.
జిల్లాలోని పది నియోజకవర్గాల్లో చాలా చోట్ల నేతల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరుకున్నాయనే వార్తలు వస్తున్నాయి.  ఎన్నికలు దగ్గర పడుతున్నా నేతల మధ్య సమన్వయం కుదరటం లేదని భోగట్టా. ఎన్నిసార్లు చంద్రబాబు వీరిమధ్య సయోధ్యకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కు తగ్గటం లేదట. ఫలితంగా నేతల మధ్య పెరుగుతున్న వివాదాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ కొంపముంచుతాయనే టెన్షన్ పార్టీ నేతల్లో పెరిగిపోతోందని సమాచారం. జిల్లాలో జమ్మలమడుగులో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి-ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలకు మొదటినుండి పడటం లేదని స్థానికంగా ప్రచారంలో ఉంది. ప్రొద్దుటూరులో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్-మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డి వర్గాలది కూడా అదే పరిస్థితి అని తెలుస్తోంది. అలాగే ఫిరాయింపు మంత్రి, రాజ్యసభ సభ్యుడు, ఎంఎల్సీ వర్గాల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయట. బద్వేలులో ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములు-మాజీ ఎంఎల్ఏ విజయమ్మ, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన విజయజ్యోతి వర్గాల వివాదాలు రోజూ వింటున్నదే అంటున్నారు. అదే విధంగా కడప, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో కూడా నేతలు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారనే వార్తలు దర్శనమిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో టిడిపి గెలిచింది ఒక్క నియోజకవర్గమన్న విషయం గుర్తుంచుకొని నేతల మెలగాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.