జనసేనలో విభేదాలు.. పవన్‌కు కొత్త టెన్షన్

గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాడు పవన్. ఒకవైపు ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజాపోరాట యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జనసేనాని.. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాడు. అందుకోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. అంతేకాదు, ఇతర పార్టీల నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల కింద వరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, లోకేష్‌లను టార్గెట్ చేసిన పవన్.. ఇటీవల ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపైనా విమర్శలు చేస్తున్నాడు. దీంతో ఏపీలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. పార్టీలోని కొందరు సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు పవన్ కల్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. అందులో భాగంగానే జిల్లాల్లో బాగా పని చేస్తున్న వారిని గుర్తించి వారిని ఆయా జిల్లాలకు ఇన్‌చార్జిలుగా నియమించాలనుకున్నాడట పవన్.

ఈ విషయంపై పలువురు ముఖ్య నేతలతో చర్చించిన జనసేనాని.. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే వారి పేర్లను చెప్పాలని మండల స్థాయి నేతలతో చెప్పాడని, దానికి వారు కొన్ని పేర్లు సూచించారని తెలుస్తోంది. మెజారిటీ అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చిన పవన్ కొంత మందిని నియమించాడు. ఇప్పుడిదే పార్టీలో విభేదాలకు కారణమవుతుందని టాక్ వినిపిస్తోంది. ముందుగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల(ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాల)కు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రకటించింది జనసేన. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో బాధ్యులను ప్రకటించనున్నారు. అయితే పార్టీ పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి పార్టీ కోసం పని చేసిన తమకు న్యాయం జరగలేదని సదరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పవన్‌కల్యాణ్ క్రియాశీలకంగా లేనప్పుడు కూడా తాము జిల్లాల్లో కార్యక్రమాలు చేశామని, అలాంటి తమను కాదని కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు పదవులు దక్కాయని జనసైనికులు ఆవేదన చెందుతున్నారని వినికిడి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.